హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మరో మూడురోజులపాటు మోస్తరు నంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధ, గురు, శుక్రవారాల్లో వివిధ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రోజుల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొన్నది.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతోపాటు వర్షాలు కురుస్తాయని పేరొన్నది. వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువకు చేరాయి. మంగళవారం నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అకడకడా వర్షాలు పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది.