Southwest Monsoon | నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. కర్ణాటక, తమిళనాడులోని, ఏపీలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలోకి వచ్చే వారం ప్రవేశించే అవకాశాలున్నాయని అంచనా వేసింది. పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రంవైపు దిగువస్థాయిలో గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో రాబోయే రెండురోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరో వైపు సోమవారం పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు భారీగానే నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 42.3, భద్రాచలం 42.2, నల్లగొండలో 41.5, రామగుండంలో 41.4, హనుమకొండలో 41, మెదక్ 40.2, నిజామాబాద్‌లో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ వివరించింది.
అరేబియా సముద్రంలో ఈ ఏడాది తొలిసారి ఏర్పడిన బిపోర్జాయ్ తుఫాను అతితీవ్రంగా మారింది. ప్రస్తుతం గుజరాత్ వైపు దూసుకువస్తుందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. మరో 36 గంటల్లో మరింత బలపడి..గుజరాత్‌లోని కచ్, పాక్‌లోని కరాచీ మధ్య ఈ నెల 15న తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే గుజరాత్ తీరప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గుజరాత్‌తో పాటు కర్ణాటక, గోవాల్లోనూ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
తుఫాను ప్రభావంతో పశ్చిమ తీర ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. సముద్రమంతా అల్లకల్లోలంగా మారిందని తెలిపింది. ప్రస్తుతం తూరు, మధ్య అరేబియా తీరంలో కేంద్రీకృతమైన తుఫాను గంటకు 8కిలోమీటర్ల వేగంతో ఈశాన్య దిశగా కదులుతున్నట్లు ఐఎండీ వెల్లడించింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 150 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తుఫాను నేపథ్యంలో ఈ నెల 15 వరకు మత్స్యకారులు వేటకు సముద్రంలోకి వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది. మరో వైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెల్టర్లలోకి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 1,300 మందిని తరలించినట్లు వివరించారు.