(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): ‘నియోజకవర్గాల పునర్విభజన పేరిట దక్షిణాది రాష్ర్టాలపై కత్తి వేలాడుతున్నది’ అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మద్దతు ప్రకటించారు. జనాభా నియం త్రణలో దక్షిణాది రాష్ర్టాలు చేసిన కృషిని పట్టించుకోకుండా, కేవలం జనాభా ఆధారంగా నియోజకవర్గాలను పునర్విభ జించడం ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. దీనిపై తాజాగా కోయంబత్తూరులో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2026లో చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ర్టాలకు కూడా కొత్తగా లోక్‌సభ స్థానాలు దక్కుతాయని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వల్ల ఎవరికి లాభం చేకూరనున్నది? ఏ రాష్ర్టాలకు నష్టం కలుగనున్నదన్న చర్చ పెద్దయెత్తున జరుగుతున్నది.
అమిత్ షా తాజా వ్యాఖ్యలను బట్టి 2026లోనే ‘జనాభా ప్రాతిపదికన పార్లమె ంట్ నియోజకవర్గాల పునర్విభజన విధానం’ (డీలిమిటేషన్) ప్రక్రియ ఉండనున్నది. దీంతో దక్షిణాది రాష్ర్టాలకు తీవ్ర అన్యాయం జరుగనున్నట్టు మేధావులు చెప్తున్నారు. జనాభా నియంత్రణలో గత కొన్నేండ్లుగా క్రమశిక్షణతో ముందుకు సాగుతున్న దక్షిణాది రాష్ర్టాలకు ఇప్పుడు ఆ క్రమశిక్షణే పెద్ద ‘రాజకీయ శిక్ష’గా మారనున్నట్టు పేర్కొంటు న్నారు. జనాభా నియంత్రణ అమలును గాలికొది లేసిన ఉత్తరాది రాష్ర్టాలు.. ఇప్పుడు పార్లమెంట్లో ఆధిపత్యం చెలాయించ నున్నట్టు చెప్తున్నారు. హిందీ మాట్లాడేవారి జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ర్టాల్లో ఎక్కువ స్థానాలను గెలుచుకొనే అవకాశం ఉన్న బీజేపీ వంటి పార్టీలకు ఇది అనుకూలంగా మారనున్నది.
1971 జనాభా లెక్కల తర్వాత కేంద్రం జనాభా నియంత్రణ చేపట్టింది. దక్షిణాది రాష్ర్టాలు జనాభా నియంత్రణ పాటించగా, ఉత్తరాదిలో జనాభా విస్ఫోటనం సంభవించింది. దీంతో ఉత్తరాదిలోనూ జనాభా నియంత్రణకు ప్రయత్నించారు. ఇందులో భాగంగానే, డీలిమిటేషన్ చట్టం-2002 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనను 2026 దాకా నిలిపేశారు. కానీ ఉత్తరాదిన జనాభా నియంత్రణ లక్ష్యం నెరవేరలేదు. ఇదే సమయంలో గడువు కూడా దగ్గరికి వస్తున్నది. దీంతో 2026లో జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాలను సవరించాలని యోచిస్తున్నారు. ఇదే జరిగితే, జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ర్టాలు పార్లమెంట్లో తమ ప్రాతినిధ్యాన్ని తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నది.
తెలంగాణలో 17 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. రాష్ట్ర జనాభా 4 కోట్లు. జనాభాను లోక్‌సభ సీట్లతో గణిస్తే 23 లక్షల మంది జనాభాకు ఒక ఎంపీ ఉన్నట్టు లెక్క. అదే బీహార్‌ను పరిశీలిస్తే ఆ రాష్ట్ర జనాభా 12.6 కోట్లు. లోక్‌సభ సీట్లు 40. అంటే, 32 లక్షల మంది జనాభాకు ఒక ఎంపీ ఉన్నట్టు అర్థమవుతున్నది. ప్రతి 15 లక్షల మంది ఓటర్లకు ఒక ఎంపీ సీటును కేటాయించారని అనుకొంటే.. ఈ లెక్కన బీహార్‌లోని ప్రస్తుత జనాభాకు అనుగుణంగా ఎంపీ స్థానాలను సవరిస్తే ఆ రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలు రెట్టింపవుతాయి. అంటే జనాభా నియంత్రణను సరిగ్గా అమలు చేయని బీహార్‌కి రాజకీయంగా ఎంతో లబ్ధి చేకూరుతుంది. జనాభా నియంత్రణను పాటించిన తెలంగాణ వంటి రాష్ర్టాలకు పార్లమెంట్లో బీహార్‌తో పోలిస్తే సీట్ల పెరుగుదల తక్కువగా ఉంటుంది.
దేశ జీడీపీలో దక్షిణాది రాష్ర్టాల వాటా 33%. మిగతా 24 రాష్ర్టాలది 67 శాతం. దక్షిణాది రాష్ర్టాలకు డీలిమిటేషన్ తర్వాత 165 లోక్‌సభ సీట్లను (20 శాతం), మిగతా రాష్ర్టాలకు 683 స్థానాలను (80 శాతం) కట్టబెట్టాలను కొంటున్నారు. ఇప్పటికే భాష, సంస్కృతి, నిధుల పంపకం, రాజకీయ ప్రాధాన్యాల విషయాల్లో ఉత్తరాదితో పోలిస్తే వివక్షకు గురవుతున్న దక్షిణాది రాష్ర్టాలకు ఢిల్లీ గద్దెనెక్కాల్సిందెవరో నిర్ణయించే అంశంలోనూ తగిన ప్రాధాన్యం దక్కని పరిస్థితి నెలకొంది. దక్షిణాది రాష్ర్టాల హక్కుల కార్యకర్తలు దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపాదికన నియోజక వర్గాలను పునర్విభజించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాలకు శాపంగా పరిణమిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ అభిప్రాయంతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని బుధవారం ఒక ప్రకటనలో కేటీఆర్ తెలిపారు. దేశ సంక్షేమం కోసం జనాభా నియంత్రణను ఒక యజ్ఞంలా భావించి, దాన్ని విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం శిక్షించాలని చూస్తోందా అని ఆయన ప్రశ్నించారు.
జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు చేసిన కృషిని పట్టించుకోకుండా, కేవలం జనాభా ఆధారంగా నియోజకవర్గాలను పునర్విభజించడం ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. దేశ నిర్మాణంలో దక్షిణాది రాష్ట్రాలు అందించిన సహకారాన్ని ఎవరూ కాదనలేరని కేటీఆర్ పేర్కొన్నారు. ‘1951లో దక్షిణాది రాష్ట్రాల జనాభా వాటా 26.2 శాతం ఉంటే అది 2022 నాటికి 19.8 శాతానికి పడిపోయిందని, అదే సమయంలో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ఉత్తరాది రాష్ట్రాల జనాభా వాటా 39.1 శాతం నుంచి 43.2 శాతానికి పెరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ లెక్కన జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్లను నిర్ణయిస్తే, ఉత్తరప్రదేశ్, బీహార్‌లకు కలిపి 222 సీట్లు వస్తాయని, అయితే ఐదు దక్షిణాది రాష్ట్రాలకు కలిపి కేవలం 165 సీట్లు మాత్రమే లభిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికవృద్ధి, మానవ అభివృద్ధి సూచికలు, జనాభా నియంత్రణ వంటి అన్ని రంగాల్లో ఉత్తరాది రాష్ట్రాల కంటే గణనీయంగా మెరుగైన పనితీరు కనబరిచాయని, అలాంటి రాష్ట్రాలను శిక్షించి, వెనుకబడిన రాష్ట్రాలను ప్రోత్సహించడం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమని ఆయన తెలిపారు. జనాభా కంటే ఆర్థిక సహకారాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణ దేశ జీడీపీకి 5.2 శాతం వాటా అందిస్తోందని, దక్షిణాది రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు అపారమైన సహకారం అందిస్తున్నాయని, ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజనలో ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కేటీఆర్ కోరారు.
కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే డీలిమిటేషన్ కారణంగా దక్షిణాది ప్రాంత రాజకీయ ప్రాతినిధ్యంపై ఎలాంటి ప్రభావం చూపదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పుకొచ్చారు. కోయంబత్తూరులో బుధవారం జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ 2026లో చేపట్టబోయే ఈ ప్రక్రియ ద్వారా దక్షిణాదికి అదనపు నియోజకవర్గాలు కూడా వస్తాయని చెప్పారు. ఈ విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మార్చి 5న అఖిల పక్ష సమావేశ ం ఏర్పాటు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.