కేసీఆర్ కలలుగన్న ‘మేడిన్ తెలంగాణ’ కల సాకారమైంది. త్రినగరి వస్త్రనగరిగా పరివర్తన చెందుతున్నది. ఒకదాని తర్వాత ఒకటిగా ఉత్పత్తిని ప్రారంభిస్తున్న పరిశ్రమలు తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నాయి. ఆజంజాహీ మిల్లును తలదన్నేలా వస్త్ర పరిశ్రమను నెలకొల్పుతామన్న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట నేడు సాకారమైంది. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ కోసం సరిగ్గా 8 ఏండ్ల క్రితం కేసీఆర్ వేసిన పునాదిరాయి నేడు ‘మేడిన్ తెలంగాణ’ అంటూ ప్రపంచాన్ని పలకరిస్తున్నది. గణేశా, కిటెక్స్ సరసన చేరిన దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ యంగవన్ తొలిదశ ఉత్పత్తిని ప్రారంభించింది.
గత పాలకుల నిర్లక్ష్యానికి మూతపడిన ఆజంజాహీ మిల్లును తలదన్నే రీతిలో వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌కు భూమి పూజ చేసుకున్నాం. కాకతీయుల పేరుతో మన ప్రాంతానికి బర్కతి ఉంటుందని పార్కుకు వాళ్ల పేరుపెట్టుకున్నం. ఇది దేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్టైల్ పార్క్‌గా రూపుదిద్దుకోబోతున్నది. పొట్ట చేతపట్టుకొని బతుకుదెరువు కోసం సూరత్, భీవండి, షోలాపూర్ ప్రాంతాలకు వలసలు వెళ్లిన నేతన్నల్లారా మీరంతా ఆత్మగౌరవంతో స్వరాష్ర్టానికి తిరిగి రావాలె. మన గడప దగ్గరే ఉపాధి దొరకాలె. అదే నా కల.
-కేసీఆర్
(2017 అక్టోబర్22న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌కు భూమి పూజ చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో)
వరంగల్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): వరంగల్ జిల్లా సంగెం, గీసుగొండ మండలాల్లోని చింతలపల్లి, శాయంపేట గ్రామాల పరిధిలో చింతలపల్లి రైల్వేస్టేషన్‌కు అటూ ఇటూ 1,357 ఎకరాల సువిశాల స్థలంలో ‘ఫాంటు ఫ్యాబ్రిక్’ నినాదంతో సరికొత్త వస్త్ర నగరికి 2017 అక్టోబర్ 22న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌కు భూమిపూజ చేశారు. అప్పుడే దక్షిణ కొరియాకు చెందిన యంగ్వన్, ది స్వయంవర్ గ్రూప్, గోకుల్దాస్ ఇమేజెస్, సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్స్, సూర్యోదయ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్, నందన్ డెనిమ్, షాహీ ఎక్స్పోర్ట్, జేకోట్ ఇండస్ట్రీస్ సహా పలు సంస్థలతో దాదాపు రూ. 3,020 కోట్లతో ఒప్పందాలు కుదిరాయి. ఇందులో యంగ్వన్ అనే సంస్థది రూ. 1,000 కోట్ల పెట్టుబడి. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఒక హెలికాప్టర్లో వస్తే యంగ్వన్ సహా పలు కంపెనీల ప్రతినిధులు రెండు హెలికాప్టర్లలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో దిగారు. తెలంగాణ ప్రజలకు పారిశ్రామిక విశ్వాసాన్ని కల్పించారు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీజీఐఐసీ) కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో పరిశ్రమల స్థాపన, ఆయా సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించేందుకు కావాల్సిన సౌకర్యాలను కల్పించింది. 220 కేవీ విద్యుత్తు సబ్‌స్టేషన్, అంతర్గత రోడ్లు, విద్యుత్తు సౌకర్యం వంటి అనేక వసతులను కల్పించింది. ప్రస్తుతం గణేశా, గణేశా ఇన్ఫోటెక్, యంగ్వన్, కిటెక్స్ సంస్థలు తమ యూనిట్లలో తొలిదశ ఉత్పత్తులను ప్రారంభించాయి.
యంగ్వన్ ‘టీ’ షర్ట్స్’.. మేడిన్ తెలంగాణ
ప్రపంచ వ్యాప్తంగా 17 దేశాల్లో వస్త్ర తయారీలో దాదాపు 90 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న దక్షిణ కొరియాకు చెందిన యంగ్వన్ వస్త్ర పరిశ్రమ కాకతీయ మెగా టైక్స్‌టైల్ పార్క్‌కు కేసీఆర్ ప్రభుత్వం భూమి పూజ చేసిన నాడే ఒప్పందం కుదుర్చుకున్నది. యంగ్వన్ కోరిక మేరకు 300 ఎకరాల (297) స్థలాన్ని కేసీఆర్ సర్కార్ వారికి అప్పగించింది. 2023 జూన్‌లో నాటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ యంగ్వన్ కార్పొరేషన్ ప్రతినిధులతో కలిసి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రెండేండ్లలో తమ ఉత్పత్తులు ప్రారంభిస్తామని శంకుస్థాపన రోజు పేర్కొన్నట్టుగానే తమ తొలి యూనిట్ ఉత్పత్తులను ఇటీవలే ప్రారంభించింది. ప్రస్తుతం ఒక యూనిట్లో టీ షర్ట్స్ తయారవుతున్నాయి. పురుషులు, మహిళలు, యువకులు, పిల్లలకు ఆసక్తికరమైన రంగులు, అత్యాధునిక హంగులతో టీ షర్ట్లు, జాకెట్లు, స్వెటర్లు, ప్రత్యేకించి ప్రపంచ ఆటగాళ్లను సైతం విశేషంగా ఆకర్షించే నాణ్యమైన ఉత్పత్తులను రూపొందించేందుకు షెడ్ల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. ఒకవైపు నిర్మాణం, మరోవైపు ఉత్పత్తి వేటికవే పోటాపోటీగా సాగుతున్నాయి.ప్రస్తుతం పూర్తయిన ఒక యూనిట్లో టీ షర్ట్లు సిద్ధమవుతున్నాయి.
ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో తయారైన యంగ్వన్ టీషర్ట్లు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. పార్క్‌లో మొత్తం 8 ప్రాజెక్టులు నిర్మించాల్సి ఉండగా తొలిదశలో ఇప్పటి వరకు 25 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఆరు భవనాల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. ఈ యూనిట్లో ప్రస్తుతం తయారయ్యే టీ షర్ట్ల విలువ నెలకు దాదాపు రూ. కోటి ఉంటుందని అంచనా. ఇక్కడ సిద్ధమైన దాదాపు 15 వేల టీషర్ట్లు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. తయారైన ప్రతీ టీ షర్ట్ మీద ‘మేడిన్ తెలంగాణ అండ్ ఇండియా’ అని ముద్రిస్తున్నారు. 2017న నాటి కేసీఆర్ ప్రభుత్వంతో యంగ్వన్ సంస్థ చేసుకున్న ఒప్పందం మేరకు 2029 నాటికి తన అన్ని స్థాయిల యూనిట్లలో ఉత్పత్తులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది. వరంగల్, హుజూరాబాద్, సంగెం, గీసుగొండ, నర్సంపేట మొదలైన ప్రాంతాల నుంచి యువత యంగ్వన్లో పనిచేస్తున్నారు. ఇందులో సింహభాగం పట్టభద్రులైన మహిళలతోపాటు నైపుణ్యం ఉన్న కొద్దిపాటి చదువు వచ్చిన వారూ ప్రస్తుతం ఉపాధి పొందుతున్నారు. కార్మిక శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా వారికి వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.
తెలంగాణకు గర్వకారణం
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో యంగ్వన్ తన ఉత్పత్తులను ప్రారంభించడం తెలంగాణకు గర్వకారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. 2017 నుంచి 2023 జూన్‌లో యంగ్వన్ కార్పొరేషన్ 11 యూనిట్లకు శంకస్థాపన చేసేదాకా కాకతీయ మెగాటెక్స్టైల్పార్క్, యంగ్వన్ సంస్థతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. యంగ్వన్ తన మొదటి యూనిట్ ఉత్పత్తిని ప్రారంభించడమే కాకుండాప్రపంచ మారెట్లకు టీ షర్ట్లు ఎగుమతి అవుతున్నాయనే విషయం తనకు అత్యంత సంతోషాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌వేదికగా యంగ్వన్ సంస్థతో తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్ను ‘ఫాం టు ఫ్యాషన్’ అన్న నినాదంతో కాకతీయ మెగాటెక్స్‌టైల్ పార్క్‌ను రూపొందించామని చెప్పారు. తెలంగాణకు కేసీఆర్ దార్శనికత, ముందుచూపు ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేందుకు కాకతీయ మెగాటెక్స్టైల్పార్క్లో రూపొందుతున్న ఉత్పత్తులపై మేడిన్ తెలంగాణ అనే గుర్తే నిదర్శనమని చెప్పారు.
నాడు కేసీఆర్ నాయకత్వంలో రూపొందిన టీఎస్ ఐ-పాస్ విధానానికి ప్రపంచమే అబ్బురపడిందని అందులో భాగమే యంగ్వన్ వంటి సంస్థలు అని పేర్కొన్నారు. యంగ్వన్ సంస్థలో పనిచేస్తున్న శ్రామికశక్తిలో 90శాతం మహిళలే అన్న విషయం తనకు ఎంతగానో సంతోషాన్ని ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు.