Special Train | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వేసవి సందర్భంగా 26 స్పెషల్ వీక్లీ ట్రైన్స్‌ను నడిపించనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని చర్లపల్లి-కన్యాకుమారి-చర్లపల్లి మధ్య వీక్లీ రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది. చర్లపల్లి నుంచి కన్యాకుమారి (07230) రైలు ఏప్రిల్ 2వ తేదీ నుంచి జూన్ 26 వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుందని చెప్పింది. అదే రోజు రాత్రి 9.50 గంటలకు రైలు బయలుదేరి.. రెండోరోజు ఉదయం 2.30 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని.. కన్యాకుమారి-చర్లపల్లి (07229) రైలు ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 వరకు ప్రతి శుక్రవారం రాకపోకలు సాగిస్తుందని తెలిపింది.
ఆయా రోజుల్లో రైలు ఉదయం 5.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.40గంటలకు గమ్యస్థానం చేరుతుందని చెప్పుకొచ్చింది. రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చర్లపల్లి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి, తిరువన్నామలై, విల్లుపురం, తిరుప్పాడిరిపులియూర్, చిదంబరం, మైలాదుత్తురై, కుంభకోణం, తంజావూరు, తిరుచిరాపల్లి, దిండిగుల్, కొడైకెనాల్ రోడ్, మధురై, విరుదునగర్, సాతూర్, కోవిల్పట్టి, తిరునల్వేలి, వల్లియూర్, నాగర్‌కోయిల్ స్టేషన్లలో ఆగుతుందని వివరించింది. రైలులో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయని వివరించింది.