Train Cancelled | దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను మిగ్జాం తుఫాను కారణంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాపాతం నమోదవుతున్నది. వానల నేపథ్యంలో రవాణా వ్యవస్థపై భారీగా ప్రభావం చూపుతున్నది. తుఫాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే పెద్ద ఎత్తున రైళ్లను రద్దు చేసింది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లను రద్దు చేసింది. ఇతర రాష్ట్రాల మీదుగా నడిచే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారిమళ్లించింది.
ఈ మేరకు ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ నెల 6న గుంటూరు-రేపల్లె (07784), రేపల్లె – గుంటూరు (07785), గుంటూరు-రేపల్లె (07786), రేపల్లె – తెనాలి (07873), తెనాలి-రేపల్లె (07874), రేపల్లె-తెనాలి (07875), తెనాలి-రేపల్లె (07876), రేపల్లె-గుంటూరు (07787) రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. అలాగే మంగళవారం నడవాల్సిన తెనాలి – రేపల్లె (07888), గుంటూరు-తెనాలి (07887) రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. అలాగే, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – ముంబయి ఎల్టీటీ (12164) రైలును చెన్నై సెంట్రల్ – తిరుత్తని మధ్య రద్దు చేసినట్లు చెప్పింది.
కాచిగూడ-రేపల్లె (17625) రైలును గుంటూరు-రేపల్లె మధ్య రద్దు చేసినట్లు పేర్కొంది. బుధవారం నడవాల్సిన రేపల్లె – మార్కాపురం (07889) రైలును రేపల్లె గుంటూరు మధ్య, సికింద్రాబాద్ – రేపల్లె (17645) రైలును గుంటూరు – రేపల్లె, రేపల్లె సికింద్రాబాద్ (17626) రైలు రేపల్లె -గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు చెప్పింది. ఇక చెంగల్పట్టు – కాచిగూడ (17651) రైలును దారి మళ్లించినట్లు పేర్కొంది. కంచీపురం-మేల్పాక్కం క్యాబిన్ మీదుగా మళ్లించినట్లు తెలిపింది. తాంబరం, చెన్నై ఎగ్మోర్, అరక్కొణం స్టేషన్లలో ఆగదని వివరించింది.