హైదరాబాద్, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ) : మార్కెట్లో మద్దతు ధర దక్కక జొన్న రైతులు గగ్గోలు పెడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొనుగోళ్లపై మీనమేషాలు లెక్కిస్తున్నదనే విమర్శలొస్తున్నాయి. జొన్నల కొనుగోలు ఫైల్ ముఖ్యమంత్రి కార్యాలయంలో మూలుగుతున్నదని తెలిసింది. ఆర్థిక శాఖ ఆమోదం తెలుపడంతో ఫైల్ సీఎంకు చేరిందని సమాచారం. అయితే, ఇప్పటివరకు సీఎం రేవంత్‌రెడ్డి ఫైల్‌ను ఆమోదించలేదని తెలిసింది. సీఎం రేవంత్‌రెడ్డి జొన్నల కొనుగోలుకు ఓకే చెబుతారా? లేక ఆర్థికభారం పడుతుందని ఫైల్‌ను బుట్టదాఖలు చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మక్కల కొనుగోలుకు అనుమతి ఇచ్చామని, ఇప్పుడు మళ్లీ జొన్నలు ఎలా కొనుగోలు చేస్తామనే అభిప్రాయంతో ప్రభుత్వ పెద్దలు ఉన్నారని తెలిసింది.
ఇందులో భాగంగానే జొన్న పంట కోతలు మొదలైనప్పటికీ, ప్రభుత్వం కొనుగోలుకు అనుమతి ఇవ్వడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గురువారం జరిగిన క్యాబినెట్ భేటీలో సైతం జొన్న కొనుగోళ్ల అంశాన్ని చర్చించలేదని సమాచారం. అయితే, పంట చేతికి రావడంతో ప్రభుత్వ కొనుగోళ్ల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. పంటలను కల్లాల్లో పోసి వేచి చూస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిద్దామంటే కనీసం పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి కరువైందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జొన్నల మద్దతు ధర క్వింటాల్‌కు రూ.3,699 ఉండగా మార్కెట్లో రూ.2వేల లోపే ధర పలుకుతున్నది. దీంతో రైతులు భారీ నష్టాలను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన సర్కార్.. ఆర్థిక లెక్కలు వేస్తుండటం విమర్శలకు తావిస్తున్నది.
ఈ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల ఎకరాల్లో జొన్న పంట సాగైంది. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, వికారాబాద్, గద్వాల జిల్లాల్లో ఎక్కువగా సాగైంది. సుమారు తొమ్మిది లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఈ మొత్తం పంటను కొనుగోలు చేయాలంటే రూ.1,500 కోట్ల వరకు అవసరం. అయితే, కొంత పంటను ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసినా సర్కార్ కనీసం రూ. వెయ్యి కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ మాత్రం నిధులను కూడా జొన్న రైతులకు కేటాయించేందుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తున్నదని సమాచారం. జొన్నలు కొనుగోలు చేస్తే ఇది ప్రభుత్వానికి భారంగా మారుతుందనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఒకవైపు రైతులు తమ పంట కొనుగోలు చేయండంటూ రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా… భారీగా నష్టపోతున్నా.. సర్కార్‌కు మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మక్కజొన్న కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం జొన్నలు ఎందుకు కొనుగోలు చేయడం లేదని జొన్న రైతులు ప్రశ్నిస్తున్నారు. తామేం పాపం చేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో మక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి బీఆర్ఎస్ చేపట్టిన మహాధర్నాలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు

మక్కజొన్న రైతులు సైతం తమ పంట కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కుతున్నారు. ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. దీంతో సర్కార్ మక్కల కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ యాసంగిలో 15 లక్షల ఎకరాల్లో మక్కజొన్న సాగు కాగా, 30 లక్షల టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. మక్కలకు మద్దతు ధర రూ.2,400గా ఉన్నది. ఈ నేపథ్యంలో 30 లక్షల టన్నుల మక్కజొన్న కొనుగోలుకు రూ.7,200 కోట్లు అవసరం. కానీ, గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో మక్కల కొనుగోలు కోసం మార్క్‌ఫెడ్‌కు రూ.4వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. అంటే, సగం పంట కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బహిరంగ మార్కెట్లో మక్కల ధర దారుణంగా పతనమైంది. మద్దతు ధర రూ.2,400 ఉండగా మార్కెట్లో రూ.1,500-1,600 మాత్రమే ధర పలుకుతున్నది. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. అయినప్పటికీ, ప్రభుత్వం సగం పంట కొనుగోలుకే అనుమతి ఇవ్వడంపై రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.