హైదరాబాద్ : రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మహర్దశ పట్టనుంది. డ్వాక్రా మహిళా సంఘాల ఉత్పాదక వస్తువులకు కామన్ బ్రాండ్ కోసం సెర్ప్ ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ ముద్ర( Telangana Brand) సార్వత్రిక గుర్తింపునకు సెర్ప్ ప్రాధాన్యం ఇస్తోంది. ఆకర్షణీయమైన ప్యాకింగ్, లేబిలింగ్ కోసం ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇప్పటికే ఫ్లిప్ కార్డ్ సంస్థ తో ఒప్పందం కాగా, అమెజాన్(amazon) వంటి ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థలతో మరిన్ని ఒప్పందాలు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) అధికారులకు సూచించారు. ఈ మేరకు మంగళవారం పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి సెక్రటరీ, సెర్ప్ సీఈవో సందీప్ కుమార్ సుల్తానియా, సెర్ప్ అధికారులతో హైదరాబాద్ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
మహిళా ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకోవాలని ఆదేశించారు.ఇప్పటికే తెలంగాణ మహిళా సంఘాలు తయారు చేస్తున్న వస్తువులకు డిమాండ్ కు తగ్గట్లుగా, మరింత ఆకర్షణీయంగా లే బిలింగ్, ప్యాకింగ్ చేస్తూ, బ్రాండింగ్ ఏర్పాటు చేస్తే మన వస్తువులకు మరింత డిమాండ్ పెరిగి, కొనుగోలు శాతం పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. దీంతో అమెజాన్ వంటి బడా అంతర్జాతీయ ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని, మరింతగా వ్యాపారం నిర్వహించుకోవచ్చని సూచించారు.ఇప్పటికే సీఎం కేసీఆర్( CM KCR) కృషి ఫలితంగా జాతీయ ,అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పేరు మారుమోగుతోందని పేర్కొన్నారు.
తెలంగాణ పేరు ప్రతిష్టలు ఉట్టి పడేలా, మహిళా ఉత్పత్తులను సులువుగా, ఆకర్షణీయంగా అంతర్జాతీయ మార్కెట్ లో అమ్ముడు పోయేలా ఈజీ గా, క్యాచీగా ఉండేట్లుగా బ్రాండింగ్ ఉండాలని సూచించారు.త్వరలోనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, వారి అనుమతితో కొత్త బ్రాండింగ్ చేయాలని, అందుకు తగ్గట్లుగా పలు పేర్లను పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమీక్షలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ హనుమంతరావు, సెర్ప్ అధికారులు రజిత, తదితరులు పాల్గొన్నారు.