Congress List | హైదరాబాద్, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాకు ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ బ్రేక్ వేశారు. జాబితాలోని పేర్లపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె.. మార్పుచేర్పులు చేసి తీసుకురావాలని ఆదేశించినట్టు తెలిసింది. జాబితాలో సీనియర్ల పేర్లు లేకపోవడంతో నేతలను ప్రశ్నించారు. ఏం సమాధానం చెప్పాలో తెలియక వారు నీళ్లు నమిలినట్టు తెలిసింది. సీనియర్లు ఉన్న నియోజకవర్గాల్లో వారి అనుమతితో కొత్త పేర్లు జతచేయాలని, ఇందుకు వారు అంగీకరించినట్టు తనకు రుజువులు చూపించాలని కూడా చెప్పినట్టు సమాచారం.
సోనియా ఆదేశాలతో ఏం చేయాలో తెలియని రాష్ట్ర నేతలు తలలు పట్టుకున్నారు. ఈసారి జూనియర్లకు టికెట్లు ఇస్తామని అంతర్గతంగా ఇప్పటికే చెప్పారు. ఇప్పుడు సోనియా తిరకాసు పెట్టడంతో ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే శుక్రవారమే రెండో జాబితా విడుదల కావాల్సి ఉండగా, సోనియా అభ్యంతరంతో మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.