హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీకి హైదరాబాద్‌లో జరిగిన అవమానంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ చాలా సీరియస్ అయ్యారా? ఆడబిడ్డలను అతిథులుగా పిలిచి అవమానిస్తారా? అంటూ ఆగ్రహించారా? అవుననే అంటున్నాయి విశ్వనీయవర్గాలు. సోమవారం ఉదయం రాష్ట్ర ముఖ్యనేత సన్నిహితుడికి సోనియాగాంధీ ఫోన్ చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత ముఖ్యనేత సూచన మేరకు ఆ సన్నిహితుడు సోనియాకు తిరిగి ఫోన్ చేసినట్టు సమాచారం. ఈ సందర్భంగా 15 నిమిషాలపాటు సంభాషణ జరిగిందని తెలిసింది. చౌమహల్లాలో మిస్ ఇంగ్లాండ్‌కు జరిగిన అసౌకర్యంపై సోనియా తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.
హైదరాబాద్‌లో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీల్లోంచి అర్ధాంతరంగా వెళ్లిపోయిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ అక్కడికి వెళ్లాక తనకు జరిగిన అవమానంపై గొంతు విప్పిన విష యం తెలిసిందే.‘ది సన్’ టాబ్లాయిడ్‌కు, బ్రి టన్ ప్రఖ్యాత పత్రిక ‘ది గార్డియన్’కు వేర్వేరు గా ఇచ్చిన ఇంటర్యూలో చౌమహల్లా ప్యాలెస్‌లో తెలంగాణ ప్రభుత్వ విందులో కొందరు తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన తీరును వెల్ల్లడించారు. అతిథులను అలరించడానికి వారితో ఫొటోలు దిగాలని, డ్యాన్సులు, క్యాట్ వాక్ చేయాలని సీనియర్ ఐఏఎస్ అధికారి సూచించినట్టు తెలిసింది. దీన్ని అలుసుగా తీసుకొని రాష్ట్ర ముఖ్యనేతతో అత్యంత సన్నిహితంగా ఉండే ఇద్దరు వ్యక్తులు ఆమె పట్ల బిస్బిహేవ్ చేశారని బయటికొచ్చింది. మిస్ బిహేవ్ చేసిన వ్యక్తి నెక్ట్స్‌టైమ్ లండన్‌కు వస్తాను, ఇద్దరం ఏకాంతంగా గడుపుదాం అని వేధించినట్టు మ్యాగీ వెల్లడించారు. భారతదేశ పరువు తీయవద్దని మౌనంగా ఉన్నా నని, కానీ తెలంగాణ ప్రభు త్వం మిస్ వరల్డ్ సంస్థతో కలిసి ప్రతీకారపూరితంగా వ్యవహరిస్తున్నదని మ్యాగీ వాపోయింది.
మిల్లా మ్యాగీ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. ఆరోపణలు చేసిన బాధితురాలితో మాట్లాడకుండానే విచారణ కమిటీ నివేదిక ఇచ్చింది. కానీ నివేదికను ప్రభుత్వం బయట పెట్టలేదు. పైగా మ్యాగీ ఆరోపణలు నిరాధారమని, అంతా మిస్‌వరల్డ్ సంస్థే చూసుకుంటుందని ప్రభుత్వంలోని కీలకవ్యక్తులు ప్రకటించారు. దీంతో ఆవేదన చెందిన మిల్లా మ్యాగీ.. తన తల్లిదండ్రులతో కలిసి మిస్ ఇంగ్లాండ్ సంస్థకు, బ్రిటన్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున మిస్ ఇంగ్లాండ్ సంస్థ సభ్యులు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. సోనియాకు మిల్లామ్యాగీ తనకు జరిగిన చేదు అనుభవాన్ని విడమరిచి చెప్పినట్టు తెలిసింది.
ముఖ్యనేత సన్నిహితుడికి ఫోన్ చేసిన సందర్భంగా సోనియాగాంధీ మిస్ బిహేవ్ వ్యవహారంపై చాలా వివరంగా ఆరాతీసినట్టు తెలిసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నేతల్లో ఒక నాయకుడి గురించే 10 నిమిషాలపాటు చర్చించినట్టు తెలిసింది. ఈ సందర్భం గా ‘హౌ డిడ్ యూ ఎంటర్టైన్ దట్ రెక్లెస్ డిస్గస్టింగ్ ఫెలో(అసహ్యకరమైన, నిర్లక్ష్యమైన నాయకుడిని ఎలా ఉపేక్షించారు?)‘అని గట్టిగా నిలదీసినట్టు సమాచారం.‘ఆడపిల్లలను పిలిచి బాధ్యతలేని వ్యక్తులను పక్కన కూర్చోబెడతారా? ప్రపంచ వ్యా ప్తంగా ఆడ పిల్లలను పిలిచినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకు తెలియదా?’అని నిలదీసినట్టు తెలిసింది. చౌహమల్లా విందులో తప్పిదాలపై కమిటీ వేశామని ముఖ్యనేత సన్నిహితుడు వివరించే ప్రయత్నం చేయగా కమిటీ రిపోర్టు ఏమి తేల్చింది? హుక్ మీ అప్ అని ప్రపోజ్ చేసిన వ్యక్తి మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఆ రిపోర్టు కాపీలు, సీసీ పుటేజ్‌లు నాకు మిల్లా మ్యాగీకి కూడా పంపించండి అని సోనియాగాంధీ ఆదేశించినట్టు తెలిసింది.