Congress | హైదరాబాద్, సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ): హైడ్రా బుల్డోజర్లు పేదల ఇండ్లపైకి దూసుకెళ్లడంపై కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేగుతున్నాయి. హైడ్రా చర్యల్ని పార్టీ నేతలు కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హైడ్రా వ్యవహారంతో పార్టీ, ప్రభుత్వం రెండుగా చీలిపోయి.. కాంగ్రెస్ ప్రభుత్వం వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా మారిపోయిందనే చర్చ గాంధీభవన్‌లో జోరందుకున్నది. ఇందులో భాగంగానే ప్రభుత్వం తీసుకున్న హైడ్రా నిర్ణయాన్ని పార్టీలో ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. హైడ్రాకు వ్యతిరేకంగా బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, అద్దంకి దయాకర్ వంటి నేతలు హైడ్రాపై బహిరంగంగానే తమ అభిప్రాయాలను వెల్లడించారు. సంగారెడ్డి జోలికి రావొద్దని జగ్గారెడ్డి హెచ్చరిస్తే, పేదల ఇండ్లను తొందరపడి కూల్చొద్దని అద్దంకి దయాకర్ సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సైతం అంతర్గత చర్చల్లో హైడ్రా వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. హైడ్రా చర్యలు పార్టీ, ప్రభుత్వాన్ని ముంచడం ఖాయమనే ఆందోళనను ఆయన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై ప్రభుత్వం పెద్దలతో మాట్లాడాలని అనుకుంటున్నట్టుగా తెలిసింది. అవసరమైతే హైడ్రాతో పార్టీకి జరుగుతున్న నష్టాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని కూడా నిర్ణయించినట్టు సమాచారం.
నీడనిచ్చే పేరు నుంచి గూడు కూల్చే పేరు
హైడ్రా ఆధ్వర్యంలో పేదల ఇండ్లను కూల్చివేయడంపై ఓ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. ఇందిరమ్మ రాజ్యం అంటూ ప్రచారం చేసుకుంటున్న తాము ఇలా పేదల ఇడ్లను కూల్చివేస్తామని ఏనాడు అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారట. పేదలకు గూడు కట్టించి నీడనిచ్చే పార్టీగా కాంగ్రెస్‌కు పేరుందని, ఇప్పుడు హైడ్రా దెబ్బతో పేదోడి గూడును కబళించే పార్టీగా పేరు ఆపాదించుకోవాల్సి వస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. హైడ్రా పేరుతో పేదోడి ఇంటిని ఎందుకు కూల్చివేస్తున్నారో, ఎవరికి కోసం కూల్చివేస్తున్నారో, దీని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో కూడా అర్థం కావడం లేదని వాపోయారట. ఇప్పటికే హైడ్రాతో కూల్చివేతల ప్రభుత్వంగా పేరు గడించామని, ఇంకా కొనసాగితే పేదోడి గుండెల్లో కాంగ్రెస్ పార్టీ జీవితాంతం శత్రువుగా మిగిలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో ఈ నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో వాళ్లు ఇప్పటికైనా ఈ చర్యల్ని ఆపేస్తే అందరికీ మంచిదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్టుగా తెలిసింది.
అంతర్గతంగా యుద్ధ వాతావరణం
హైడ్రా విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా తెలిసింది. ఇటు ప్రభుత్వ పెద్దలకు, అటు పార్టీ పెద్దలకు అంతర్గతంగా యుద్ధ వాతావరణం నెలకొన్నట్టు సమాచారం. పైకి మాత్రం హైడ్రాను సమర్థిస్తూ మాట్లాడుతూనే లోలోపల మాత్రం ప్రభుత్వ పెద్దలపై తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలిసింది. ఇందులో భాగంగానే హైడ్రా చర్యల్ని పార్టీ పెద్దలు వారిస్తుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. అభివృద్ధి పేరుతో హైడ్రాను అడ్డంపెట్టుకొని పేదల ఇండ్లను కూల్చడం ఏంటని పార్టీ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ ప్రజా వ్యతిరేక చర్యలతో కేవలం ప్రభుత్వానికి మాత్రమే నష్టం కాదని, అంతకు మించి మూల్యాన్ని పార్టీ చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం.