Kodangal | కొడంగల్/పరిగి, నవంబరు 16: లగచర్ల ఘటన జరిగి వారం గడుస్తున్నా గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సహా 20 మంది రైతులను అరెస్టు చేసిన పోలీసులు శనివారం మరో నలుగురు రైతులను అరెస్టు చేశారు. వారిలో నీరటి రాఘవేందర్, మదరయ్య, బసయ్య, గోపాల్ ఉన్నారు. వారిని పరిగి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
దీంతో ఫార్మా బాధిత గ్రామాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పులిచెర్లకుంట తండాకు చెందిన ఓ గిరిజన మహిళ గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో చేర్పించినట్టు సమాచారం. బాధిత గ్రామాల రైతులను పరామర్శించేందుకు వెళ్లిన సీపీఎం, వ్యవసాయం కార్మిక సంఘం, అంబేద్కర్ యువజన సంఘం నాయులు వెంకటయ్య, బుస్స చంద్రయ్య, రమేశ్‌బాబును పోలీసులు అడ్డుకున్నారు.