Telangana | బయ్యారం, మే 27: డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు.. భారీగా వేతనాలు.. అంటూ కొందరు ఏజెంట్లు భారతీయ నిరుద్యోగులను నమ్మిస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి లక్షన్నర వరకు తీసుకొని కంబోడియాకు పంపిస్తున్నారు. అక్కడ చైనా, కంబోడియా కంపెనీల ఏజెంట్లు భారతీయులే లక్ష్యంగా సైబర్ నేరాలకు పాల్పడటంపై 7-10 రోజులపాటు వీరికి శిక్షణ ఇప్పిస్తారు. అనంతరం బెట్టింగ్, సైబర్ మోసాలపై ఒక్కొక్కరికి భారీ టార్గెట్లు విధిస్తారు. లక్షాన్ని చేరితే రెండుపూటలా భోజనం పెడతారు. ఈ క్రమంలో బాధితులు తిరస్కరించినా, ఎదురుతిరిగినా, టార్గెట్ చేరకపోయినా దాడులకు దిగుతారు. ఒక్కపూటే అన్నం పెడతారు. చీకటి గదుల్లో వేసి చిత్రహింసలు పెడతారు. మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి బేస్‌బాల్ బాట్లతో విపరీతంగా కొడతారు.
ఇప్పటివరకు 5000 మందికిపైగా భారతీయులు చైనా ఏజెంట్ల వలలో చిక్కి కంబోడియాకు చేరినట్టు అంచనా. అక్కడ ఒక్క ఏపీవారే 150 మంది చిక్కుకోగా, ఇటీవలే 58 మంది విశాఖకు తిరిగి చేరుకున్నారు. మిగతా వారిని తీసుకొచ్చేందుకు ఏపీ సర్కారు భారత ఎంబసీతో సంప్రదింపులు జరుపుతున్నది. కంబోడియా కేంద్రంగా కొందరు ఏజెంట్లు భారతీయులను సైబర్ ఉచ్చులో దింపి నగదు లాగేస్తున్నారు. పెద్ద మొత్తం నగదు గుంజి వివిధ బ్యాంకు ఖాతాలకు మళ్లిస్తూ క్రిప్టో కరెన్సీగా మారుస్తున్నారు. కొందరు ఏడాదిగా, మరికొందరు ఆరు నెలలుగా, ఇంకొందరు మూడు నెలలుగా కంబోడియాలో పనిచేస్తున్నారు. తెలంగాణ యువకుడు కూడా కంబోడియా ఏజెంట్ల చేతిలో చిక్కి చిత్ర హింసలకు గురయ్యాడు. ప్రస్తుతం అతడు భారత ఎంబసీ అధికారులు ఆధీనంలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేటకు చెందిన మున్సఫ్ ప్రకాశ్ బీటెక్ పూర్తి చేసి మూడేండ్లు హైదరాబాద్‌లోని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. మార్చి 8న ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఉద్యోగం కోసం ఆస్ట్రేలియా వెళ్తున్నట్టు కుటుంబసభ్యులకు చెప్పాడు. ఆ ఏజెన్సీ వారు ఆస్ట్రేలియా కాకుండా మలేషియాకు తీసుకువెళ్లారు. అక్కడ రెండు నెలలపాటు బాగానే ఉన్నాడు. ఇంటికి ఫోన్ చేసి కుటుంబసభ్యులతో మాట్లాడుతుండేవాడు. 15 రోజుల క్రితం ప్రకాశ్‌ను కంబోడియాకు తీసుకెళ్లారు. బెట్టింగ్ మోసంపై శిక్షణ ఇచ్చారు. ఫోన్‌కాల్స్ చేసి బెట్టింగ్ పెట్టించేలా టార్గెట్లు ఇచ్చారు. లేకుంటే చిత్రహింసలు పెట్టారు.
అతడితోపాటు మరికొందరు యువకులు, యువతులు కూడా ఉన్నారు. ఈ హింసలు తట్టుకోలేక పోతున్నానని తన అన్న ప్రశాంత్‌కు కొన్ని రోజులుగా ఫోన్ చేసి ఆవేదనను వెలిబుచ్చాడు. గాయాల వీడియోలు కూడా పెట్టాడు. ఏం చేయాలో తెలియని కుటుంబసభ్యులు.. ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రకాశ్‌ను వెనక్కి వచ్చేలా కృషి చేయాలని వేడుకుంటున్నారు. ప్రకాశ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సోమవారం స్పందించారు. ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడినట్టు, ప్రకాశ్ క్షేమంగా ఉన్నాడనే సమాచారాన్ని కుటుంబసభ్యులకు వెల్లడించినట్టు తెలిపారు. ఎంబసీ అధికారులు ప్రకాశ్‌ను ఇండియాకు పంపించనున్నట్టు పేర్కొన్నారు.
కంబోడియా దేశంలో చిత్రహింసలు అనుభవిస్తున్న ప్రకాశ్ కుటుంబం తమిళనాడు నుంచి 40 ఏండ్ల క్రితం తెలంగాణకు వలస వచ్చింది. ఇక్కడే డబల్ రొట్టెలు, పాపడాలు తయారుచేస్తూ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ప్రకాశ్ తల్లి విజయ పదేండ్ల క్రితం, తండ్రి రాజు నాలుగేండ్ల క్రితం చనిపోయారు. అన్న ప్రశాంత్ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. కుటుంబ పోషణ భారంగా మారడంతో ప్రకాశ్ హైదరాబాద్‌కు వెళ్లి ఉద్యోగం చేశాడు.