TG Tourism | హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : సోమశిల, నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ సేవలు అందుబాటులోకి తెచ్చినట్టు పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. లాంచీ సేవలు ఈ నెల 2 నుంచి ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. కృష్ణ మ్మ ఒడిలో, నల్లమల పచ్చదనానికి చెందిన అందాలను వీక్షిస్తూ.. కృష్ణా నదిలో సాగే జల విహారానికి తెలంగాణ పర్యాటకశాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు.
ప్రయాణికుల కోసం టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు టికెట్ బుకింగ్ https://tourism. telangana.gov.in/ వెబ్ సైట్ను సంప్రదించాలని కోరారు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు, నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు సింగిల్ జర్నీలో పెద్దలకు రూ. 2,000, పిల్లలకు రూ.1,600, రౌండప్ (రానుపో ను కలిపి) జర్నీలో పెద్దలకు రూ.3, 000, పిల్లలకు రూ. 2,400 గా ధరలు నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో లాంచీ ప్రయాణంతో పాటు టీ, స్నాక్స్ అందించనున్నట్టు మంత్రి ప్రకటించారు.