హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రజాస్వామ్య పద్ధతులను విస్మరించిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్ మండిపడ్డారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఓ పక్క సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమైందని, ఈ సమయంలో నామినేషన్లు వేయడానికి ఇచ్చిన సమయం సరిపోదని పేర్కొన్నారు. కనీసం వారం రోజులైనా గడువు ఇవ్వాలని ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30 వరకు మాత్రమే గడువు విధించారని, నాలుగు రోజుల సమయం ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. కేవలం ప్రతిపక్షాలను దృష్టిలో పెట్టుకొని తగిన సమయం ఇవ్వలేదని విమర్శించారు.
రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసుకోవడానికి, తగిన డాక్యుమెంట్లు సమకూర్చుకోవడానికి ఈ సమయం ఏ మా త్రం సరిపోదని సోమ భరత్‌కుమార్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇంత తొందర దేనికీ? అని ఆయన ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విషయం లో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేస్తున్నదని స్పష్టం చేశారు. అధికారం ఉంది కదా! అని తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎలా? అని ప్రశ్నించారు. దేశంలో ఎప్పుడూ ఇంత తప్పుడు పద్ధతుల్లో షెడ్యూల్ విడుదల చేయలేదని పేర్కొన్నా రు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం తమ పద్ధతి మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో అసెంబ్లీ స్పీకర్ ఒక్కో పార్టీకి ఒక్కో నీతి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, సుప్రీంకోర్టు ఇప్పటికే రెండు సార్లు స్పీకర్‌కు తాఖీదులు ఇచ్చిందని గుర్తుచేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను ఈ నెల 30న హాజరు కావాలని ఆదేశించారని, పార్టీ ఫిరాయింపుపై అన్ని ఆధారాలున్నా చర్యలకు స్పీకర్ వెనుకాడుతున్నారని విమర్శించారు. ట్రిబ్యునల్ చైర్మన్‌గా ఉన్న అసెంబ్లీ స్పీకర్ రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కే వాసుదేవరెడ్డి, బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధి లలితారెడ్డి పాల్గొన్నారు.