హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): సోలార్ ప్లాంట్ల టెండర్లల్లో తెలంగాణకు చెందిన చిన్న కాంట్రాక్టర్లకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని సోలార్ ఇంటిగ్రేటర్లు ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సర్కార్ బడా కాంట్రాక్టర్లకు అనుకూలంగా నిబంధనలు పెట్టి, తెలంగాణ బిడ్డల పొట్టగొడుతున్నదని వాపోయారు. శుక్రవారం తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షుడు బుర్రా అశోక్‌కుమార్ నేతృత్వంలోని తెలంగాణ సోలార్ ఇంటిగ్రేటర్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు.
బీఆర్ఎస్ సర్కార్ అమలుచేసిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో స్కూళ్లల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటులో తెలంగాణ పారిశ్రామికవేత్తలకు సమాన అవకాశాలు కల్పించారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో స్థానికులకు 30% పనులు ఇవ్వడమే కాకుండా డిపాజిట్ (ఈఎండీ) మినహాయింపు వర్తింపజేశారని, కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుతో 500 చిన్న కాంట్రాక్టర్లు రోడ్డునపడబోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ సర్కార్ 10వేల బడుల్లో 2,3,5 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచిందని, ఈ టెండర్ నిబంధనలు ఆందోళనకరంగా ఉన్నాయని అసొసియేషన్ ప్రతినిధులు వాపోయారు. వార్షిక టర్నోవర్ రూ.150 కోట్లు, ఏడాదిలో 25 మెగావాట్ల ప్లాంట్లు ఏర్పాటుచేసి ఉండాలన్న నిబంధనలు పెట్టడం ద్వారా బడా కాంట్రాక్టర్లకే ఈ పనులను అప్పగించబోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అర్హతలు రాష్ట్రంలో ఏ ఒక్క కంపెనీకి కూడా లేవని, కమీషన్ల కోసం, బడా కంపెనీలకు కట్టబెట్టేందుకు ఈ నిబంధనలు పెట్టారని ఆరోపించారు.
ఏడాది గడిచినా ఈ ప్రాజెక్ట్‌లో కనీస పురోగతి లేదని కేటీఆర్‌కు వివరించారు. సర్కార్ వైఖరిని నిరసిస్తూ త్వరలోనే ధర్నాకు దిగబోతున్నామని, మద్దతు ఇవ్వాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేటీఆర్.. తెలంగాణకు చెందిన చిన్న కాంట్రాక్టర్లకు అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీనిచ్చారు. కేటీఆర్‌ను కలిసినవారిలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీహరిబాబు, జాయింట్ సెక్రటరీలు శ్రీనివాస్ కుక్కెడపు, బాబునాయుడు, కార్యవర్గసభ్యులు బదరి నారాయణ, జాన్ విలియం, రాఠీ తదితరులు ఉన్నారు.