గద్వాల అర్బన్, జూన్ 11: జోగుళాంబ గద్వాల జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతున్నది. పగలూరాత్రి అనే తేడాలేకుండా నిత్యం గుట్టలను తోడేస్తూ యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నది. అధికారుల సహకారంతోనే దందా జోరుగా సాగుతున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లను జమ్మిచేడ్ వాసులు అడ్డుకున్నారు.
మట్టి అక్రమ తరలింపును సహించేది లేదంటూ నిరసన తెలియజేశారు. పలు ప్రాంతాల్లో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని అధికారులకు సమాచారం అందించినా స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. మాఫియాతో ప్రభుత్వ ఖజానాకు గండి పడుతున్నదని, ఇప్పటికైనా అధికారులు నిద్రమత్తు వీడి మట్టి తరలింపును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.