Software Engineers | హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ‘సరిపోదా శనివారం’ అంటే.. హ్యాంగ్ఓవర్ దిగడానికి సోమవారం కూడా సెలవు కావాలనే సాఫ్ట్వేర్ మత్తుబాబులు పెరిగిపోతున్నారు. సోమవారం రాగానే వచ్చే వీకెండ్‌ను ఎక్కడ, ఎలా ఎంజాయ్ చేయాలో పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ పార్టీకి కావల్సిన గంజాయి, హెరాయిన్, కొకైన్ లాంటి డ్రగ్స్‌ను డార్క్‌వెబ్ నుంచి ఆర్డర్ చేసుకుంటున్నారు. ఆపై మత్తులో జోగుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలా ఖమ్మానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇటీవల డార్క్‌వెబ్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసి పట్టుబడ్డాడు. ఇటీవల ఇలా పట్టుబడినవారిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ప్రైవేట్ ఉద్యోగులు, ఇంజినీరింగ్ విద్యార్థులే ఎక్కువగా కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు డార్క్సైట్లో తెలంగాణవారికి ‘నో సెల్లింగ్’ బోర్డులు పెట్టగా.. ఇప్పుడు అదే డార్క్సైట్లో ‘స్టాక్ అవైలబుల్ ఫర్ ఆల్’ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి.
ఈ ఏడాది తొలి 3 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 500కుపైగా ఎన్డీపీఎస్ కేసుల్లో 981 మంది పట్టుబడ్డారు. వీరిలో దాదాపు 70% మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఇంజినీరింగ్ విద్యార్థులే ఉన్నట్టు టీజీన్యాబ్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు టీజీన్యాబ్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన దాడుల్లోనూ సాఫ్ట్వేర్ టెకీలు, ఇంజినీరింగ్ విద్యార్థులే ఎక్కువగా పట్టుబడటం ఆందోళన కలిగిస్తున్నది. వారిలో కొందరు ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడే తమకు గంజాయి మత్తు అలవాటు అయినట్టు చెప్తున్నారు. ఇటీవల ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజ్‌లో గంజాయి సేవిస్తూ పదుల సంఖ్యలో ఇంజినీరింగ్ విద్యార్థులు పట్టుబడ్డారు. వారిని ‘నమస్తే తెలంగాణ’ ప్రశ్నించగా.. తమ కళాశాలలోని ఉత్తరాది విద్యార్థులు గంజాయి అలవాటు చేశారని, ఆ తర్వాత తాము ధూల్‌పేటకు వెళ్లి గంజాయి తెచ్చుకున్నామని తెలిపారు.
ఒకసారి మత్తుకు బానిసైన తర్వాత తమకు ఏం చేయాలో అర్థం కావడం లేదని, ప్రతిసారి ఇంట్లో డబ్బులు అడగలేక గంజాయి, సింథటిక్ డ్రగ్స్ అమ్మేవారితో స్నేహం పెంచుకుని వాటిని ఇతరులకు విక్రయిస్తున్నామని కొందరు విద్యార్థులు, టెకీలు చెప్తున్నారు. మరోవైపు పబ్స్లోనూ డ్రగ్స్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వీటికి చెక్‌పెడితే తమ పబ్బులకు ఎవరూ రారని భావించి యజమానులు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. దీంతో డ్రగ్స్ కట్టడి మరింత కష్టతంగా మారిందని టీజీన్యాబ్ అధికారులు చెప్తున్నారు.