అలంపూర్ చౌరస్తా/ హుస్నాబాద్‌రూరల్, డిసెంబర్ 5: ఉన్నత చదువులు చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న స్థానిక పోరులో సర్పంచ్ పదవులకు పోటీచేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ సర్పంచ్ స్థానానికి గ్రామానికి చెందిన లావుడ్య రవీందర్ పోటీచేస్తున్నాడు. రవీందర్ పంజాబ్‌లో బీటెక్ చదివి, ఢిల్లీలో ఎంబీఏ పూర్తి చేశాడు. యూరప్‌లో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేశాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. గ్రామానికి ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్‌గా పోటీచేస్తున్నట్టు రవీందర్ తెలిపారు. రవీందర్ తన సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేయించినట్టు గ్రామస్థులు తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం బొంకూరుకు చెందిన రవళి హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ నెలకు రూ.40 వేలకుపైగా వేతనం అందుకుంటున్నది. మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు రావడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచినట్టు తెలిపింది.