హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ హెటెక్ టెక్స్టైల్ పార్క్ భూములను కాజేసేందుకు కుట్ర జరుగుతున్నదని సొసైటీ సభ్యులు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా చేగూరులో పద్మశాలీలు యూనియన్‌గా ఏర్పడి టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు రైతుల నుంచి 2003లో సేకరించిన 142 ఎకరాల భూములను కాజేసేందుకు సొసైటీ అధ్యక్షుడు, ఐదుగురు డైరెక్టర్లు కుట్ర చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్పట్లో 108 మంది పద్మశాలీలు కలిసి ఒక సొసైటీగా ఏర్పడి, రూ.40 వేల నుంచి రూ.1.2 లక్షల దాకా వెచ్చించి, 142 ఎకరాలను కొనుగోలు చేశామని చెప్పారు. భూములను 108 మందికి షేర్ల రూపంలోకి మార్పిడి చేసి, రిజిష్ర్టేషన్ చేసుకోవాలని భావించినట్టు వెల్లడించారు.
కానీ ఈ సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్న ఉప్పల నర్సయ్య తమ పేరిట షేర్లు బదలాయించినట్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చూపించారని, తమకు మాత్రం రిజిస్ట్రేషన్ చేయించకుండా 20 ఏండ్ల నుంచి ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై పోలీసు, రెవెన్యూ అధికారులు, కోర్టులకు మొరపెట్టుకున్నా న్యాయం జరగడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
ఆ భూములను నగర శివారులో ఉండటంతో ధరలు అమాంతం పెరగియని, అందుకే సొసైటీ అధ్యక్షుడు కాజేసేందుకు కుట్ర పన్నుతున్నారని చెప్పారు. ఉప్పల నర్సయ్యతో పాటు సొసైటీ డైరెక్టర్లలో ఒకరైన గన్శామ్ సరోడే పేరిట చెరో 50 శాతం షేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన సబ్సిడీలను సైతం సొంత ఖర్చులకు వాడుకుని తమను ఆ భూముల్లోకి రానివ్వడం లేదని వాపోయారు.