HYDRAA | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ): ‘చెరువును పూడ్చి కట్టిన రెస్టారెంట్లు, పబ్లు, బిల్డింగ్లు’ కనిపిస్తలేవా?..ఇవన్నీ సక్రమ కట్టడాలా? పేద ప్రజల ఇండ్లే అక్రమ కట్టడాలా?.. అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడో నెటిజన్. ‘కూల్చడం నిమిషాలే.. కానీ కట్టడానికి సంవత్సరాలు, పడగొట్టడం కాదు.. నిలబెట్టడం ముఖ్యం’.. అంటూ మరో యువకుడు సర్కారుకు చురకలంటిస్తున్నాడు. ఇలా సోషల్ మీడియా వేదికగా ప్రజాగళం బయటికొస్తున్నది. హైడ్రా పేరిట ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై సామాజిక మాధ్యమాల్లో సర్వత్రా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. పెద్దోళ్లకు నోటీసులు ఇస్తూ.. పేదోళ్ల ఇండ్లను ఆగమేఘాల మీద కూల్చివేస్తుండడంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పుడు ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాలో హైదరాబాద్, మూసీ నిర్వాసితుల కన్నీళ్లు, బాధితుల ఆర్తనాదాలు, ఆగ్రహావేశాలే వైరల్ అవుతున్నాయి.
పదేండ్ల కిందట మీ ప్రభుత్వమే పట్టా..పర్మిషన్లూ ఇచ్చింది.. ఇప్పుడు మీరే వచ్చి ఇది అక్రమం అంటున్నారు? ఇదెలా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏకిపారేశాడో నెటిజన్. ఇందిరమ్మ ఇచ్చిన పట్టా ఇదంటూ ఓ బాధితురాలి ఆక్రందనల వీడియోను ట్యాగ్ చేశాడు మరో నెటిజన్. ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్కు పేరు ప్రతిష్టలున్నాయి. ఆ ఇమేజ్ను డ్యామేజ్ చేసేందుకే ఇదంతా చేస్తున్నారా అంటూ మరో నెటిజన్ ప్రశ్నించాడు. పేదల పాలిట యమపాశంలా మారిందీ సర్కారు ‘ఎటు పోతున్నదీ రాష్ట్రం.. ఇందుకోసమేనా ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నది’ అం టూ ఓ సోషల్ వారియర్ చేసిన పోస్ట్ సర్వత్రా ఆలోచింపజేస్తున్నది. పేదల విషయంలో బుల్డోజర్లతో దూసుకువస్తూ… దుర్గం చెరువు ఆక్రమణలను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నిస్తున్నారు. అన్ని అనుమతులతో నిర్మించుకున్న భవనాలను పేక మేడల్లా కూల్చివేస్తున్న సర్కార్.. పెద్దల విషయంలో అంతే వేగంతో నిర్ణయాలు తీసుకోవడం లేదని నిలదీస్తున్నారు. ‘నీ అన్నకు 30రోజుల టైం.. పేదలకు మూడు నిమిషాలు కూడాటైం లేదా?’ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాంటి రాక్షస పాలనను చూడలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మూసీ, హైడ్రా నిర్వాసితులకు అండగా సోషల్ మీడియా వారియర్లు నిలుస్తున్నారు. అర్థవంతమైన చర్చలు, సమర్థవంతమైన వివరణలతో నెటిజన్లు కాంగ్రెస్ సర్కారును ఆటాడుకుంటున్నారు. హైడ్రా, మూసీ బాధితుల వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. బయటి ప్రపంచానికి తెలిసేలా చేయడంలో నెటిజన్లు కృతకృత్యులయ్యారు. నిర్వాసితులకు అండగా నిలుస్తూ మద్దతు కూడగడుతున్నారు.
రెండేండ్ల కిందట ఆంధ్రా నుంచి ఓ వ్యక్తి కుటుంబంతో సహా హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేస్తూ ఇక్కడే సెటిలైపోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకు కారణం.. ఇక్కడ జరిగిన అభివృద్ధి.. హైదరాబాద్కు ఉన్న ఇమేజ్.. సర్కారు చర్యలే. కానీ, అదే వ్యక్తి ప్రస్తుతం ఇక్కడ ఉండాలంటేనే భయమేస్తుందంటున్నాడు. ఏ ల్యాండ్ కొనాలనుకోవడం లేదంటూ కాంగ్రెస్ సర్కారు పాలనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలా సోషల్ మీడియా వేదికగా గత కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తేడాను జనం వివరిస్తున్నారు.