హైదరాబాద్‌లోని గోషామహల్‌కు చెందిన ఉబర్ డ్రైవర్ జీ శ్యాంసుందర్.. ఆర్టీసీ బస్సు కింద పడి చనిపోయాడు. డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టుల ప్రమాద బీమా కోసం కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన సోషల్ సెక్యూరిటీ స్కీమ్ కోసం ఆర్నెల్ల క్రితం శ్యాంసుందర్ కుటుంబం దరఖాస్తు చేసుకున్నది. ఇంతవరకు ఎలాంటి పరిహారమూ అందలేదు. అతడిపైనే ఆధారపడ్డ తల్లి, పెండ్లిళ్లు కాని ఇద్దరు చెల్లెండ్లు సర్కారు ఆసరా కోసం ఎదురుచూస్తున్నారు. అసలు బీమా ప్రీమియమే చెల్లించని కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది బడుగుజీవుల కుటుంబాలను వంచిస్తున్నది.
ఎన్నికల ముందు అసంఘటి తరంగ కార్మికులు, గిగ్ వర్కర్లకు అడ్డగోలు హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కారు, డ్రైవర్లకు రూ. 5 లక్షల ప్రమాద బీమా ప్రీమియం ఎగ్గొట్టి మొండిచెయ్యి చూపింది. 2024 అక్టోబర్ నుంచి ఈ పథకాన్ని బంద్ పెట్టి ప్రమాదవ శాత్తు మరణించిన డ్రైవర్ల కుటుంబాలను రోడ్డుపాలు చేసింది.– కేటీఆర్
జనగామ జిల్లాకు చెందిన కావటి ప్రవీణ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్. డ్యూటీ ముగించుకొని బైక్‌పై వెళ్తుండగా 2023 ఏప్రిల్‌లో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ప్రమాద బీమా కోసం దరఖాస్తు చేసి, ఆ కుటుంబమంతా ఇప్పటికీ డబ్బుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నది. ప్రవీణ్‌కు ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబాన్ని పోషించే ప్రవీణ్ చనిపోవడంతో ఆ కుటుంబ దీనావస్థ మాటల్లో చెప్పలేనిదని అతడి భార్య కన్నీటి పర్యంతమవుతున్నది. ప్రమాద బీమా త్వరగా వస్తే తమకు భరోసాగా ఉంటుందని వేడుకుంటున్నది.
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): కుటుంబ భారం మోసే వ్యక్తి.. రో డ్డు ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందన్న కనీస సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకుండా పోయింది. బడుగుల బతుకుల్లో వెలుగులు నిపేందుకు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ‘సోషల్ సెక్యూరిటీ స్కీమ్’కు రేవంత్‌రెడ్డి సర్కారు పనిగట్టుకొని మంగళంపాడింది. 2024 అక్టోబర్ 8న ఈ పథకానికి చెల్లించాల్సిన ప్రీమియాన్ని ఎగ్గొట్టింది. దీంతో సుమారు 14 లక్షల మంది ప్రమాద బీమా అంధకారంలో పడింది. అసంఘటిత రంగంలో నిత్యశ్రామికులుగా పనిచేస్తున్న రవాణాశాఖ డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులు ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండాలనే ఉద్దేశంతో 2015 మేడే రోజున నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ‘సోషల్ సెక్యూరిటీ స్కీమ్’ను ప్రవేశపెట్టారు.
ఈ మూడు వర్గాల్లో గుర్తింపుపొందిన వారు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా చెల్లించేలా కార్యాచరణ రూపొందించారు. ఆనాటి నుంచి కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలను కంటికిరెప్పలా కాపాడుకుంటూ, వారి తరఫున ప్రీమియం చెల్లిస్తూ వచ్చింది. కానీ ప్రభుత్వం మారిన వెంటనే ఈ పథకంపై సమీక్ష చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. బీఆర్ఎస్ డిమాండ్ మేరకు ఇందులోకి గిగ్ వర్కర్లను కూడా చేర్చుతూ 2023 డిసెంబర్లో జీవో ఇచ్చారు. ఎంతో హడావుడిగా ప్రకటన చేసి ఆ తర్వాత.. వారికి ప్రీమియం చెల్లించడం మర్చిపోయారు. దీంతో 2024, అక్టోబర్ 8 నాటికి ఆ పథకం ప్రీమియం గడువు ముగిసిపోయింది. నేటికి ఏడాదైనా ప్రభుత్వం బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లించడం లేదు.
13.5 లక్షల మందికి భరోసా..
నాడు కేసీఆర్ తెచ్చిన ఈ పథకంలో ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు 13,11,072 మంది, హోంగార్డ్లు 17,655, అక్రిడేటెడ్ జర్నలిస్టులు 22,515 మందితో కలిపి మొత్తం 13,51,242 లక్షల మంది చేరారు. ప్రభుత్వం వారందరికీ ప్రీమియం చెల్లించకపోవడంతో వారందరి కుటుంబాలకు కవరేజ్ లేకుండా పోయింది. ఈ ప్రమాద బీమా కోసం కొన్ని కుటుంబాలు రెండేండ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నాయి. అయితే, 2015-2024 మధ్య సుమారు 558 క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటికి ప్రభుత్వం చెల్లించాల్సిన బీమా మొత్తం సుమారు రూ.30 కోట్ల వరకు ఉన్నది. కార్మికశాఖ గణాంకాల ప్రకారం తొమ్మిదేండ్లలో మొత్తం 1,496 క్లెయిమ్‌లు దాఖలవ్వగా, 938 కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయి. వీటిలో డ్రైవర్లకు సంబంధించి 1,375 క్లెయిమ్‌లలో 855, హోంగార్డుల 100 క్లెయిమ్‌లలో కేవలం 67, జర్నిలిస్టుల 21 క్లెయిమ్‌లలో 16 మాత్రమే పరిషారమయ్యాయి.
శాఖల మధ్య సమన్వయం లోపం
లక్షలాది కుటుంబాలకు మేలు చేకూర్చే ఈ బీమా పథకానికి శాఖల మధ్య సమన్వయం పెద్ద లోపంగా మారింది. కార్మిక, రవాణాశాఖలు, బీమా కంపెనీల మధ్య సమయానికి సమాచార మార్పిడి లేకపోవడంతో ఫైళ్ల ప్రాసెసింగ్‌లో తీవ్ర ఆలస్యమైందని ఓ ఉన్నతాధికారి ‘నమస్తే తెలంగాణ’కు చెప్పారు. ప్రస్తుతం బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లించకపోవడంతో ఆ పథకం అమలు అగమ్యగోచరంగా మారిందని తెలిపారు. పరిపాలనా లోపాలు, నిధుల విడుదలలో ఆలస్యాన్ని సవరించుకుంటే ఈ పథకాన్ని కూడా రైతుబీమా పథకంలాగానే అమలు చేయొచ్చని చెప్తున్నారు. అయితే, ఈ పథకాన్ని పునరుద్ధరించాలా? లేదా? అనే విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని కార్మికశాఖ అధికారులు తెలిపారు. దీనిస్థానంలో కొత్త పథకానికి రూపకల్పన చేస్తారా? లేక దీనినే అమలు చేస్తారా? అనేదానిపై చర్చలు జరుగుతున్నాయని, అవేమీ కార్యరూపం దాల్చడం లేదని అంటున్నారు.
డ్రైవర్ల కుటుంబాలు రోడ్డుపాలు : కేటీఆర్
ఎన్నికల ముందు అసంఘటితరంగ కార్మికులు, గిగ్ వర్కర్లకు అడ్డగోలు హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కారు, డ్రైవర్ల రూ. 5 లక్షల ప్రమాద బీమా ప్రీమియం ఎగ్గొట్టి మొండిచెయ్యి చూపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ మానవీయ కోణంలో ప్రారంభించిన ఈ పథకాన్ని ఊడగొట్టారని శుక్రవారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. 2024 అక్టోబర్ నుంచి ఈ పథకాన్ని బంద్ పెట్టి ప్రమాదవశాత్తు మరణించిన డ్రైవర్ల కుటుంబాలను రోడ్డుపాలు చేసిందని విరుచుకుపడ్డారు. రైతుబీమా, నేతన్నబీమా, డ్రైవర్ల బీమా లాంటి స్కీంలతో సబ్బండ వర్గాల భవిష్యత్తుకు కేసీఆర్ ధీమా ఇస్తే..ఒక్కో పథకానికి మంగళంపాడుతూ పేద కుటుంబాల జీవనాన్ని ఈ కర్కశ ప్రభుత్వం అగమ్యగోచరంగా మారుస్తున్నదని అన్నారు.
బీమా 10 లక్షలకు పెంచండి
సోషల్ సెక్యూరిటీ స్కీమ్‌లో ప్రమాద బీమాను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలి. బాధిత కుటుంబాలకు తక్షణం పరిహారం విడుదల చేయాలి. ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తే బాధిత కుటుంబాలకు ఎంతో భరోసాగా ఉంటుంది. ప్రమాదంలో గాయపడితే చికిత్స ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించేలా పాలసీని పునరుద్ధరించాలి. క్షతగాత్రులకు కూడా రూ.5 లక్షలు ఇవ్వాలి.
– షేక్ సలాలుద్దీన్, టీజీపీడబ్ల్యూయూ అధ్యక్షుడు
ప్రీమియం కట్టండి
రవాణాశాఖ డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులు, గిగ్ వర్కర్లకు మేలు చేసే ఈ పథకానికి ప్రభుత్వం తక్షణం ప్రీమియం చెల్లించాలి. మాకు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేయాలి. నాడు చెప్పినట్టుగా ప్రమాద బీమాను రూ.10 లక్షలకు పెంచాలి. అంగవైకల్యానికి, సాధారణ మరణానికి కూడా పరిహారం ఇస్తానని చెప్పి ఇప్పుడు ఆ పథకాన్ని పూర్తిగా ఎత్తివేస్తే చూస్తూ ఊరుకోం. ఈ పథకం అమలుపై తక్షణం ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలి.
– అత్తినమొని నగేశ్‌కుమార్, ట్యాక్సీ అండ్ గిగ్ వర్కర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు (బీఆర్టీయూ)