హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ) :
దావోస్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం తమ ఘనతగా చెప్పుకుంటున్న పెట్టుబడులు ఇవి. కానీ.. ఈ మూడు కంపెనీలూ హైదరాబాద్‌కు చెందినవే. మన రాష్ట్ర రాజధానిలో కొలువైన కంపెనీలు.. మన రాష్ట్రంలోనే పెట్టుబడులు పెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయన్నమాట. అదీ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో. ఆయా కంపెనీల ప్రధాన కార్యాయాల నుంచి ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న సచివాలయంలో చేసుకోవాల్సిన ఒప్పందాలు.. ఏడువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దావోస్‌లో ఎందుకు జరిగాయని సోషల్‌మీడియాలో ప్ర శ్నలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి స్కైరూ ట్ కంపెనీ బీఆర్ఎస్ హయాంలో స్థాపించిన టీహబ్‌లో పురుడుపోసుకున్నది. టీవర్క్స్ సా యంతో 2022లోనే సొంతంగా దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్‌ను ఆవిష్కరించింది. తొలి ఇంటిగ్రేటెడ్ రాకెట్ డిజైన్, మాన్యుఫ్యాక్చరింగ్, టెస్టింగ్ ఫెసిలిటీని తెలంగాణలో స్థాపిస్తామని ప్రకటించింది. 2022 నవంబర్ 26న జరిగిన ఈ కార్యక్రమానికి నాటి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. అలాంటి సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నదంటూ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకోవడంపై మండిపడుతున్నారు.
దావోస్ పర్యటనలో భారీగా పెట్టుబడులు సాధిస్తున్నట్టు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాపత్రయపడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే.. హైదరాబాద్‌కే చెందిన కంపెనీలతో స్విట్జర్లాండ్‌లో ఎంవోయూలు చేసుకున్నారని విమర్శిస్తున్నారు. వాస్తవానికి డబ్ల్యూఈఎఫ్ వేదికగా తెలంగాణలో ఉన్న అవకాశాలను దేశ, విదేశీ కంపెనీలకు పరిచయం చేసి, చర్చలు జరిపి, పెట్టుబడులు సాధించాల్సి ఉంటుందని చెప్తున్నారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే విదేశీ కంపెనీలను తెలంగాణకు ఆకర్షించేలా ప్రజంటేషన్ ఇవ్వాలని సూచిస్తున్నారు. అలాంటిది హైదరాబాదీ కంపెనీలకు కొత్తగా తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరించాల్సిన అవసరం ఏమున్నదని ప్రశ్నిస్తున్నారు. ఈ తతంతం మొత్తం ఇక్కడే పూర్తి చేయొచ్చని, కేవలం సొంత ప్రచారం కోసమే డబ్ల్యూఈఎఫ్ను వేదికగా చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. మేఘా రూ.15వేల కోట్లు, కం ట్రోల్ ఎస్ సంస్థ రూ.10వేల కోట్లు, స్కైరూట్ రూ.500 కోట్లు.. మొత్తంగా మూడు కంపెనీలు కలిపి రూ.25,500 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రభుత్వం చెప్తున్నది.
హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): పెట్టుబడులు తీసుకురావడంలో రేవంత్‌రెడ్డి తీరును చూస్తే నవ్వొస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన కంపెనీలతో వేలాది మైళ్ల దూరంలో ఉన్న దావోస్, స్విట్జర్లాండ్‌లో ఎంవోయూలు కుదుర్చుకోవడం సీఎం రేవంత్‌రెడ్డికే చెల్లిందని సెటైరికల్ ట్వీట్ చేశారు. తెలంగాణ కంపెనీలైన మేఘా, స్కైరూట్, సీఆర్ఎల్ఎస్తో విదేశాల్లో ఒప్పందాలు చేసుకుంటే విదేశీ పెట్టుబడులు తెచ్చినట్టు ఎలా అవుతుందో ఆయనకే అర్థం కావాలని ఎద్దేవా చేశారు.