బుధవారం 27 మే 2020
Telangana - May 20, 2020 , 01:56:50

నిర్లక్ష్యానికి తప్పదు మూల్యం

నిర్లక్ష్యానికి తప్పదు మూల్యం

  • సడలింపుల వేళ అప్రమత్తత అవసరం
  • కరోనా సోకకుండా జాగ్రత్తలు తప్పనిసరి
  • మాస్కు లేకుండా అడుగు బయటపెట్టొద్దు
  • ప్రతిఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలి
  • అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో కరోనా వైరస్‌ సోకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని వైద్యవిభాగాలు సూచిస్తున్నా యి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నాయి. ప్రజలు బయటకు వెళ్లినప్పుడు విధిగా భౌతికదూరం పాటిస్తేకరోనా దరిచేరదని సూచిస్తున్నా యి. రాష్ట్రంలో ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ కొనసాగనున్నది. ప్రజల అవసరాల దృష్ట్యా ప్రభుత్వం కల్పించిన సడలింపులను సద్వినియోగం చేసుకుంటూ.. ఎవరికివారు అప్రమత్తంగా వ్యవహరిస్తే వైరస్‌వ్యాప్తి చెందదని వైద్య నిపుణులు చెప్తున్నారు.

ప్రజలు ప్రధానంగా పాటించాల్సినవి 

  • మార్కెట్లు, పనిచేసే ప్రాంతాల్లో, ప్రయాణాలు, ఇతర సందర్భాల్లో భౌతికదూరం తప్పనిసరి. కొత్తవారితో మాట్లాడేటప్పుడు 6 అడుగుల దూరంలో ఉండాలి. 
  • ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతపై దృష్టిపెట్టాలి. సబ్బు లేదా శానిటైజర్‌ లేదా హ్యాండ్‌వాష్‌ లిక్విడ్‌తో తరచూ చేతులను కడుక్కోవాలి. 
  • వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలి. 
  • చిన్నపిల్లలు, వృద్ధులు ఇల్లు వదిలి బయటకు రాకపోవడమే ఉత్తమం. బీపీ, షుగర్‌, గుండె, శ్వాసకోస వ్యాధులతో బాధపడుతున్నవారు, క్యాన్సర్‌ రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలి. అనవసర ప్రయాణాలు రద్దు చేసుకోవడం మంచిది.
  • జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి, గొంతునొప్పి, ఒంటి నొప్పులు వంటి లక్షణాలుంటే తక్షణం వైద్యుడిని సంప్రదించాలి. కరోనా పాజిటివ్‌ వ్యక్తిని కలిసినవారు ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా ప్రభుత్వ దవాఖానలో చేరాలి. కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో నివసించేవారు, అక్కడికి వెళ్లి వచ్చినవారు అప్రమత్తంగా ఉండాలి. రోగ లక్షణాలు లేకపోయినా ఏ మాత్రం నలతగా ఉన్నా ఇండ్లలోనే ఉండాలి. 

మాస్కు ఉంటేనే నిత్యావసర సరుకులు

మాస్కు లేకపోతే నిత్యావసర సరుకులను విక్రయించకూడదని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ మంగళవారం ఆదేశించారు. రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని అన్ని దుకాణాల్లో పనిచేసే సిబ్బంది, కొనుగోలుదారులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. కొనుగోలుదారులు మాస్కు ధరించకపోతే రూ.1000 జరిమానా విధించాలని కమిషనర్లను ఆదేశించారు. దుకాణాల వద్ద శానిటైజర్లను ఏర్పాటుచేయాలన్నారు. 

డ్రైవర్లు, ప్రయాణికులు జాగ్రత్త

ఆటో, క్యాబ్‌, టాక్సీ డ్రైవర్లు సహా ప్రయాణికులు వైరస్‌పై జాగ్రత్తగా ఉండాలని రవాణాశాఖ కమిషనర్‌ ఎంఆర్‌ఎం రావు చెప్పారు. నిబంధనలు పాటించనివారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ట్రాన్స్‌పోర్ట్‌ భవన్‌నుంచి జిల్లాల ఆర్టీఏ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇప్పటివరకు లాక్‌డౌన్‌లో రవాణాశాఖ అధికారులు, సిబ్బంది సమర్థంగా పనిచేశారని ప్రశంసించారు. ఆర్టీఏ కార్యాలయాలకు వివిధ పనులపై వచ్చేవారికి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలని ఆదేశించారు. 

మాస్కు లేకపోతే కేసే

 మాస్కు లేకుండా బయటికొచ్చేవారిపై పోలీసులు కేసులు నమోదుచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 7వ తేదీనుంచి మంగళవారం వరకు మాస్కు లేకుండా బయటతిరిగిన 16,264 మందిపై డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ 51(బీ) కింద కేసులు చేశారు. వీటిలో అత్యధికంగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 3,892 మందిపై కేసులు నమోదయ్యాయి. వరంగల్‌లో 1,846 మందిపై, రామగుండంలో 1,105 మందిపై, రాచకొండలో 1,105 మందిపై, సైబరాబాద్‌లో 844 మందిపై కేసులయ్యాయి. నగరాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ మాస్కులేని వారిపై కేసులు నమోదు చేస్తున్నట్టు పోలీస్‌ అధికారులు తెలిపారు.


logo