హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ), లోకాయుక్తల నూతన పాలకవర్గం నియామకం నిబంధనల ప్రకారం జరగలేదని సామాజిక కార్యకర్తలు బుర్ర శ్రీనివాస్, గుడిచుట్టు రామనాథం ఆరోపించారు. ప్రభుత్వం పంపించిన ఈ ఫైల్‌ను తిప్పి పంపాలని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు వారు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గవర్నర్‌కు ఆదివారం వారు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ప్రభుత్వం ప్రకటించిన గడువులోగా దరఖాస్తు చేసుకోకున్నా చైర్మన్‌గా జస్టిస్ షమీమ్ అక్తర్‌ను ఎంపిక చేశారని అందులో ప్రస్తావించారు. అదే విధంగా తెలంగాణ లోకాయుక్త నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వకుండానే జస్టిస్ ఏ రాజశేఖర్‌రెడ్డిని నియమించడం నిబంధనలు పాటించకపోవడమేనని పేర్కొన్నారు. దీనిపై ఎన్నో అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని లేఖలో గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి అర్హులను ఆయా పదవుల్లో నియమించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.