మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి సాంఘిక సంక్షేమ గురుకులంలో ఓ విద్యార్థిని పాముకాటుకు గురయ్యింది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అశ్మితను పాము కరిచింది. విద్యార్థినిని పాఠశాల సిబ్బంది మహబూబాబాద్ ఏరియా దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు.
ఇనుగుర్తి, ఫిబ్రవరి 3 : మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో ఓ విద్యార్థిని పాముకాటుకు గురైంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అశ్మిత మంగళవారం ఉదయం స్నానాల గదికి వెళ్లగా, చేయిపై పాము కాటువేసింది. విద్యార్థిని కేకలు వేస్తూ తనను పాము కాటు వేసిందని తెలుపగా, వెంటనే సిబ్బంది వచ్చి 108లో మహబూబాబాద్ ఏరియా వైద్యశాలకు తరలించారు.
ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని వైద్యులు పేర్కొన్నారు. గురుకుల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో పాములు సంచరిస్తున్నాయని, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే గురుకుల పరిసరాలు శుభ్రం చేసి విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, లేకపోతే గురుకులం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.