హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సర్కార్ బడులు, మాడల్ స్కూల్స్‌లోని పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్ సమకూర్చే అంశంపై కదలిక వచ్చింది. స్పెషల్ క్లాసులకు హాజరయ్యే విద్యార్థులకు స్నాక్స్ సమకూర్చాలని పాఠశాల విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకు రూ.4.23 కోట్లు మంజూరుచేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. వార్షిక పరీక్షలు సమీపిస్తుండటంతో సర్కార్ బడుల్లో పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే, క్లాసులకు హాజరయ్యే వారికి స్నాక్స్ ఇవ్వడంలేదు. ఇదే విషయంపై ‘పది విద్యార్థుల ఆకలి కేకలు’ శీర్షికతో బుధవారం ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ బడ్జెట్ మంజూరు చేసింది.
సగం రోజులు పస్తులే..
రాష్ట్రంలో 4,303 హైస్కూళ్లు ఉండగా, వీటిల్లో పదో తరగతి విద్యార్థులు 1,48,461 మంది ఉన్నారు. రోజుకు ఒక విద్యార్థికి స్నాక్స్ కోసం 15 రూపాయల చొప్పున ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు 19 రోజులు మాత్రమే స్నాక్స్ సమకూర్చాలని స్పష్టంచేశారు. వాస్తవానికి, డిసెంబర్ నుంచి మార్చి వరకు 90 రోజులపాటు విద్యార్థులకు స్నాక్స్ సమకూర్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ సర్కార్‌కు ప్రతిపాదనలు పంపించింది. విద్యాశాఖ నుంచి ఈ ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు చేరాయి. ఆర్థిక శాఖ ఇందుకు బ్రేక్‌వేసింది. స్నాక్స్ అందజేసే రోజులను 19కి కుదిస్తూ పాఠశాల విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలో పదో తరగతి స్పెషల్ క్లాసులు అక్టోబర్, నవంబర్ మాసాల్లోనే ప్రారంభమయ్యాయి. ఈ సారి టెన్త్ పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్నారు. అంటే ఏప్రిల్ 16 వరకు టీచర్లు విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధంచేస్తారు. కానీ, తాజా ఉత్తర్వుల ప్రకారం మార్చి 10వ తేదీతోనే స్నాక్స్ బంద్ అవుతాయి. విద్యాశాఖ ఉత్తర్వుల పట్ల ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. 19 రోజులు కాకుండా, చివరి పరీక్ష వరకు విద్యార్థులకు స్నాక్స్‌ను సమకూర్చాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు, నవాత్ సురేశ్ విజ్ఞప్తి చేశారు.
45 రోజులకు పెంచాలి : టీఆర్టీఎఫ్
స్నాక్స్‌ను 45 రోజులకు పెంచాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) డిమాండ్ చేసిం ది. నిరుడు 39 రోజులు అందించారని, ఈసారి 19 రోజులకే కుదించడం సబబు కాదని, తక్షణమే ఉత్తర్వులను సవరించాలని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమేశ్, అంజిరెడ్డి కోరారు.