హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ప్రపంచమంతటా అనుసరిస్తున్న అధునాతన రోడ్డు నిర్మాణ పద్ధతులను తెలంగాణలోనూ అమలు చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. స్మార్ట్ రోడ్ టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఫ్యూచరిస్టిక్ ఆటొమేటెడ్ కన్స్ట్రక్షన్, ఐసీటీ వంటి అధునాతన పద్ధతులను రోడ్ల నిర్మాణంలో వినియోగించి రోడ్డు మరణాలను తగ్గిస్తామని అన్నారు. సచివాలయంలో సోమవారం ప్రపంచబ్యాంకు ప్రతినిధులతో మంత్రి కోమటిరెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి ప్రపంచబ్యాంకు సహకారంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక అత్యంత ప్రమాదకరంగా ఉన్న హైవేలపై ట్రామాకేర్ సెంటర్స్ ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టామని, ఇప్పటికే హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై ట్రామాకేర్ సెంటర్ నిర్మాణంలో ఉన్నదని తెలిపారు. ప్రపంచబ్యాంక్ రవాణారంగ ప్రధాన అధికారి రీనూ అనుజా తమ బ్యాంక్ సహకారంతో అమలవుతున్న రోడ్డు నిర్మాణాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఆర్అండ్బీ శాఖ ప్రత్యేక ప్ర ధాన కార్యదర్శి వికాస్ రాజ్, ప్రత్యేక కార్యదర్శి హరిచందన, ఈఎన్సీ మధుసూధన్‌రెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ) : కార్యకర్తల సాధకబాధకాలు వినేందుకు ప్రతి బుధ, శుక్రవారాల్లో వివిధ శాఖల మంత్రులు అందుబాటులో ఉండనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించనున్నారు. ఈ మేరకు సోమవారం పీసీసీ అధ్యక్షుడు బొమ్మగాని మహేశ్కూమార్గౌడ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 25న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, 27న పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అందుబాటులో ఉండనున్నట్టు తెలిపారు.