హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు స్మార్ట్ రేషన్‌కార్డులు, స్మార్ట్ హెల్త్‌కార్డులను విడివిడిగా అందజేయనున్నట్టు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. కొత్త రేషన్‌కార్డులు, హెల్త్‌కార్డుల జారీ కోసం సలహాలు, సూచనలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన క్యాబినెట్ సబ్‌కమిటీ సోమవారం మరోసారి భేటీ అయ్యింది. సబ్‌కమిటీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఎర్రమంజిల్‌లోని జలసౌధలో జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశానంతరం మంత్రులు ఉత్తమ్, శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్‌కార్డులు ఉన్నట్టు వెల్లడించారు. కొత్త రేషన్‌కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాలను ఈ నెలాఖరులోగా పూర్తిచేసి, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పా రు. జనవరి నుంచి రాష్ట్రంలోని రేషన్‌కార్డుదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తామని, సన్నవడ్లను పండించిన రైతులకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్‌ను కూడా ఈ సీజన్ నుంచే అమలు చేస్తామని చెప్పారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసేందుకు మం త్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన క్యాబినెట్ సబ్‌కమిటీ సోమవారం జలసౌధలోనే ప్రత్యేకంగా భేటీ అయ్యింది. సబ్‌కమిటీ కో-చైర్మన్, సభ్యులుగా ఉన్న మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్‌తోపాటు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి తదితరులు ఈ సమావేశంలో పాల్గొని సుప్రీంకోర్టు తీర్పులోని అంశాలపై చర్చించారు.