హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థల్లో అన్ని శాఖలకున్న అధికారాలను హైడ్రాకు కట్టబెట్టింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సర్కారు హైడ్రాకు సర్వాధికారాలు కట్టబెట్టింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. అనంతరం వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాకు వివరించారు.
హైడ్రాకు విస్తృత అధికారాలు
హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఓఆర్ఆర్ లోపల ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, నాలాల ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లోని నిర్మాణాలపై హైడ్రా నిర్ణయం తీసుకోనున్నదని మంత్రులు తెలిపారు. ఇందుకోసం ఓఆర్ఆర్ లోపలి పట్టణ స్థానిక సంస్థల్లోని అన్ని శాఖలు, విభాగాలకు ఉన్న అధికారాలు, స్వేచ్ఛలను హైడ్రాకు కట్టబెడుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రులు తెలిపారు. ఇందులో పనిచేసేందుకు వివిధ విభాగాల నుంచి 169 మంది అధికారులు, 946 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను డిప్యూటేషన్ మీద బదిలీ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.
మూడు వర్సిటీలకు పేర్లు మార్పు
రాష్ట్రంలోని మూడు యూనివర్సిటీలకు పేర్లను మార్చుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. కోఠిలోని మహిళా యూనివర్సిటీని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని సురవరం ప్రతాప్‌రెడ్డి తెలుగు యూనివర్శిటీగా మార్చినట్టు తెలిపారు. కొత్తగా ఏర్పాటుచేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టారు.
రెండేండ్లలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తి
శ్రీశైలం ఎడమకాలువ టన్నెల్ పనులకు సంబంధించిన అంచనాలను రూ.4,637 కోట్లకు సవరించినట్టు మంత్రులు తెలిపారు. 2027 సెప్టెంబర్ నాటికి టన్నెల్ పనులతోపాటు డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పెండింగ్ పనులను పూర్తి చేసేలా కాంట్రాక్టర్‌ను ఆదేశించామని చెప్పారు. టన్నెల్ పూర్తయితే శ్రీశైలం ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్ నుంచి కృష్ణా జలాలను తీసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. ప్రతి నెలా 400 మీటర్ల చొప్పున రెండేండ్లలో టన్నెల్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
ఖరీఫ్ నుంచే సన్నవడ్లకు బోనస్
ఈ ఏడాది ఖరీఫ్ నుంచే సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రులు తెలిపారు. ఇందుకోసం పంట కొనుగోళ్ల బడ్జెట్‌కు అదనంగా రూ.2,500 కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. కొత్త, పాత రేషన్‌కార్డులకు కలిపి వచ్చే ఏడాది జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు.
ట్రిపుల్ ఆర్‌పై కమిటీ
ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు చేసేందుకు 12 మంది అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రులు తెలిపారు. ఆర్ అండ్ బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ పనిచేస్తుందని, ఇందులో రెవెన్యూ, మున్సిపల్ శాఖల కార్యదర్శులు, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్ అండ్ బీ, నేషనల్ హైవే అథారిటీ అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు.
క్యాబినెట్ ఇతర నిర్ణయాలు..