హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర సచివాలయంలో మరోసారి చిన్న కాంట్రాక్టర్లు మెరుపు ధర్నాకు దిగారు. ఈ ఏడాది మార్చిలో రాష్ట్రంలోని సుమారు 200 మందికిపైగా సివిల్ కాంట్రాక్టర్లు సచివాలయంలోని ఆర్థిక శాఖ పేషీ ఎదుట తమ పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని బైఠాయించగా.. తాజాగా సోమవారం సచివాలయంలో 100 మందికిపైగా ‘మన ఊరు-మన బడి’ పనులు చేసిన కాంట్రాక్టర్లు ఒక్కసారిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పేషీల ఎదుట ఆందోళనకు దిగారు. ఎవరికివారు వేర్వేరుగా అక్కడికి చేరుకునే దాకా పోలీసు సిబ్బంది గుర్తించలేకపోయారు. ఊహించనివిధంగా కాంట్రాక్టర్లంతా ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చాంబర్ ఎదుట బైఠాయించారు. ఆయన తన చాంబర్లో లేరని అక్కడి సిబ్బంది చెప్పారు. ఆర్థిక శాఖ ము ఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో సమావేశంలో ఉండటంతో కాంట్రాక్టర్లంతా భట్టి చాంబర్ వద్దకు చేరుకొని పెద్దఎత్తున నినాదాలు చేశా రు. ప్రభుత్వం చిన్న కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బకాయిలను విడుదల చేయాలని, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తమతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. సుమారు అరగంటకుపైగా కాంట్రాక్టర్లంతా భట్టి పేషీ వద్ద ఆందోళన చేశారు. చివరకు భట్టి వచ్చి కాంట్రాక్టర్ల నుంచి వినతి పత్రం స్వీకరించారు.
తాము రెండేండ్లుగా బిల్లుల కోసం తిరుగుతున్నామని, ఇప్పటికీ బిల్లులు ఎందుకు ఇవ్వలేదని కాంట్రాక్టర్లు భట్టిని నిలదీశారు. తామంతా చిన్న కాంట్రాక్టర్లమని, రెండేండ్లుగా బిల్లులు ఇవ్వకుంటే తాము ఎట్లా బతకాలని ప్రశ్నించారు. వందల మంది కాంట్రాక్టర్లకు చెందిన మొత్తం కేవలం రూ.369 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, తమకన్నా ఎక్కువ బిల్లులున్న బడా కాంట్రాక్టర్లకు మంజూరు చేస్తున్నారని, తమకెందుకు ఇవ్వడంలేదని, వారంలోగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం సకాలంలో బిల్లులు విడుదల చేయకపోవడంతో పిల్లలకు పెండ్లిళ్లు చేయలేకపోతున్నామని, నలుగురు కాంట్రాక్టర్లు ఆత్మహత్యకు ప్రయత్నించారని పలువురు కాంట్రాక్టర్లు వాపోయారు. ఇది అత్యంత ఆందోళనకరమైన విషయమని భట్టికి వివరించారు.
కాంట్రాక్టర్లతో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి వారికి ఎలాంటి నిర్దిష్టమైన హామీ ఇవ్వలేదు. ‘చూస్తాం.. పరిశీలిస్తాం’ అని మాత్రమే చెప్పారు. దీనిపై కాంట్రాక్టర్లు మాట్లాడుతూ వారంలోగా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకుంటే తాము బడులకు తాళాలు వేస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ సరార్గా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సచివాలయంలో చిన్న కాంట్రాక్టర్ల ధర్నాపై సోమవారం ఓ ప్రకటనలో స్పందించారు. సచివాలయంలో కాంట్రాక్టర్ల ధర్నా.. సీఎం రేవంత్ అవినీతి పాలనకు నిలువెత్తు నిదర్శనమని దుయ్యబట్టారు. 20% కమీషన్ ఇవ్వడం లేదని చిన్న కాంట్రాక్టర్ల బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపిందని మండిపడ్డారు. క్యాబినెట్ మంత్రులు, బడా కంపెనీలకు మాత్రం వేలకోట్ల బిల్లులను చెల్లిస్తున్నదని ఆరోపించారు. కాంట్రాక్టర్లు స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట ధర్నా చేయడం రాష్ట్ర ప్రభుత్వ దిగజారుడు పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. వేలకోట్ల ముడుపుల కోసం బడా కాంట్రాక్టర్లకు, మంత్రుల కంపెనీలకు బిల్లులు చెల్లిస్తూ ఢిల్లీకి మూటలు పంపుతున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం, కేవలం ముడుపులు ఇవ్వడం లేదన్న ఏకైక కారణంతో చిన్న కాంట్రాక్టర్లను ముప్పుతిప్పలు పెడుతున్నదని విమర్శించారు. గతంలో డిప్యూటీ సీఎం చాంబర్ ముందు, తాజాగా సీఎం కార్యాలయం ఎదుటే కాంట్రాక్టర్ల ధర్నా చేశారంటే రేవంత్ పాలన ఎంతలా దిగజారిందో తేటతెల్లమవుతున్నదని దుయ్యబట్టారు. 20 శాతం కమీషన్లు ఇవ్వలేని చిన్న కాంట్రాక్టర్లు చివరికి సచివాలయంలో ధర్నాకు దిగడం, రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలు ఆర్థిక పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం గత ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ లాంటి ప్రజా సంక్షేమ పథకాల పని చేసిన వారికి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంపై కాంగ్రెస్ సిగ్గుపడాలని నిప్పులు చెరిగారు.
20 నెలల పాలనలోనే 2.20 లక్షల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం, 420 ఎన్నికల హామీల్లో ఒక హామీనీ అమలు చేయకుండా ఇన్ని లక్షల కోట్లను ఏం చేశారన్నదానిపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరిపాలనకు కేంద్రంగా నిలవాల్సిన సచివాలయం, నేడు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. చిన్న కాంట్రాక్టర్లకు వెంటనే బకాయిలు చెల్లించకుంటే బాధిత కాంట్రాక్టర్లతో కలిసి బీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తుందని హెచ్చరించారు.
‘మొన్న కమీషన్లు ఇవ్వకుంటే పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడం లేదని సచివాలయంలోని ఆర్థిక మంత్రి కార్యాలయాన్ని ముట్టడించారు. నిన్న అదే సచివాలయం సెకండ్ ఫ్లోర్‌లోని ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ఎదుట మెరుపు ధర్నాకు దిగారు. ఇలా కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ధర్నాలు చేయడం దేశంలోనే మొదటి సారి కావచ్చు’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడంలో సీనియారిటీ పాటించకుండా కమీషన్లు దండుకుంటున్నారనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం ఉంటుందని ప్రశ్నించారు. పాలన తీరు, కమీషన్ల వసూళ్లు చూస్తుంటే అసలు ఇది కాంగ్రెస్ ప్రభుత్వామా? స్కాంగ్రెస్ ప్రభుత్వమా? అర్థం కావడం లేదని సోమవారం ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. ‘ఒక మిషన్ లేదు..విజన్ లేదు..ఉన్నదల్లా ఒక్కటే టార్గెట్.. అది కమీషన్’ అని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ సర్కారు తీరుపై ప్రజలంతా ఏకమై తిరగబడతారని హెచ్చరించారు.
మేమంతా చిన్నచిన్న కాంట్రాక్టర్లం. స్కూళ్లలో ఎలక్ట్రిసిటీ, డైనింగ్ హాళ్లు, బాత్రూంల నిర్మాణం, ఇతర రిపేర్లు, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పనులు చేసినం. రెండేండ్లుగా మాకు రూపాయి కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. పెండింగ్ బిల్లుల కోసం కాళ్లరిగేలా సెక్రటేరియట్ చూట్టూ తిరుగుతున్నం. చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నపుడు రెండు సార్లు మాకు బిల్లులు మంజూరు చేసింది. చివరి విడతలో ఉన్నవారికి మాత్రం ఈ ప్రభుత్వం ఇంకా బిల్లులను పెండింగ్‌లోనే పెట్టింది.
బిల్లులు రాక ఏం చేయాలో తెలియక కొందరు కాంట్రాక్టర్లు ఆత్మహత్యకు ప్రయత్నించిండ్రు. వరంగల్‌లో ఓ కాంట్రాక్టర్ సొంత ఇంటిని అమ్ముకోవాల్సి వచ్చింది. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. ఊర్లలో చిన్న పనులు చేసుకునే మేము.. ప్రభుత్వం చేస్తున్న పనుల్లో, ముఖ్యంగా స్కూళ్లకు ఉపయోగపడాలన్న సదుద్దేశంతో సొంత డబ్బు పెట్టి పనులు చేస్తే బిల్లులు ఇవ్వకుండా సతాయిస్తున్నది. ప్రభుత్వం స్పందింకపోతే మేము ప్రత్యక్ష కార్యాచరణకు దిగక తప్పదు. ప్రభుత్వం కోసం పనులు చేసి నష్టపోయినం. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందిపడుతున్నం.
ప్రభుత్వం నుంచి మేము బాజాప్తా పనులు తీసుకొని చేసినం. ఎంబీ ఆన్లైన్లోనే అయ్యింది. 2023 ఆగస్టు నుంచి రూపాయి కూడా విడుదల చేయలే. ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రావాలని చెప్తున్నరు. ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా కలిసి వినతిపత్రాలు ఇచ్చినం. జిల్లాల్లో కలెక్టర్లకు, ఫూలే భవన్ (ప్రగతిభవన్)లో అధికారులకు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్లకు విన్నపాలు సమర్పించినం.