హైదరాబాద్, జూన్ 8 (నమస్తేతెలంగాణ): నైరుతి రుతుపవనాల గమనం మందగించడంతో రాష్ట్రవ్యాప్తంగా వానలు ముఖం చాటేశాయి. ఈ ఏడాది రుతుపవనాలు నిర్ధిష్ట సమయం కంటే ముందుగానే రాష్ట్రంలో ప్రవేశించినప్పటికీ ..ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. నాలుగు రోజులుగా నైరుతి రుతుపవనాల్లో ఎలాంటి కదలిక లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 15 తర్వాత కొద్దిగా మార్పు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. జూలై మొదటి వారం నుంచి వర్షాలు స్థిరంగా ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నారు. కాగా, సీజన్ మొదటివారంలో రాష్ట్రంలో -79 మి.మీ లోటు వర్షపాతం నమోదైంది.
రాష్ట్రంలోని నారాయణపేట -55 మి.మీ, యాదాద్రి-భువనగిరిలో -56 మి.మీ, సిద్దిపేటలో -57 మి.మీ, మహబూబాబాద్‌లో -58 మి.మీ, జనగామలో -58 మి.మీ, మేడ్చల్-మల్కాజిగిరిలో -59 మి.మీ లోటు వర్షపాతం నమోదవగా మిగతా 27 జిల్లాల్లో తీవ్ర లోటు వర్షపాతం నెలకొంది. మరోవైపు ఐదు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరాయి. మంగళవారం పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశమున్నదని, వాతావారణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
‘మే’నెలలో రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. ఈ మేరకు కేంద్ర వాతావరణశాఖ ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది మేనెలలో దేశవ్యాప్తంగా 127.7 మి.మీ వర్షపాతం నమోదైనట్టు పేర్కొన్నది. 1901 సంవత్సరం మేనెలలో కురిసిన 100.9 మి.మీ వర్షపాతమే ఇప్పటి వరకు అత్యధికం కాగా, 124 ఏండ్ల తర్వాత ఆ రికార్డు బ్రేక్ అయిందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు దక్షిణ, తూర్పు భారతదేశం అంతటా విస్తరించడంతో ఈ రికార్డు నమోదైనట్టు వెల్లడించింది.