ఎల్కతుర్తి/జైనూర్, జూలై 8 : రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి విశాల సహకార సొసైటీకి మంగళవారం వచ్చిన రైతులు తమ చెప్పులను క్యూలో పెట్టి యూరియా కోసం పొద్దంతా ఎదురుచూశారు. 2 ఎకరాలకు ఒకే బస్తా ఇస్తామని చెప్పి, అది కూడా రోజుకు 100 బస్తాలు మాత్రమే విక్రయిస్తున్నారు. యూరియా తీసుకెళ్లిన రైతులకు మళ్లీ నెల రోజుల వరకు ఇవ్వకూడదని పైఅధికారుల ఆదేశాలు ఉన్నట్టు సమాచారం. దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అసలే పంటలు పెరిగే దశలో యూరియా వేయకపోతే దిగుబడి తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై మంగళవారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఆయా గ్రామాలకు చెందిన దాదాపు 30 మంది రైతులు వారం రోజులుగా యూరియా కోసం పీఏసీఎస్ కేంద్రానికి వచ్చి వెళ్తున్నారు. కానీ.. యూరియా దొరకడం లేదు. దీంతో ఆగ్రహం చెందిన రైతులు మండల కేంద్రంలోని రహదారిపై బైఠాయించారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటామని చెప్పి అవసరాలు తీర్చడంలో పూర్తిగా విఫలమైందని రైతులు మండిపడ్డారు.
బేల, జూలై 8 : ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న యూరియాను అక్రమంగా తరలిస్తున్న ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ జీవన్‌రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం హాకా నిర్వాహకుడు సునీల్, ఉద్యో గి అజయ్ మహారాష్ట్రకు చెందిన ఫర్టిలైజర్ దుకాణం యజమాని నిఖిల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
01
మంగళవారం ఉదయం రూ.3 లక్షల విలువ గల యూరియాను రెండు వాహనాల్లోని 200 బ్యాగులు తరలిస్తుండగా రైతులు దహేగామ, సిర్సన్న గ్రామాల్లో పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. జైనథ్ సీఐ సాయినాథ్, బేల ఎ స్సై నాగనాథ్లు రెండు వాహనాలను సీజ్ చేశా రు. వాహన డ్రైవర్లు వాంకడే దిలీప్, చిలకలవార్ చంద్రశేఖర్, హాకా నిర్వాహకుడు సునీల్, ఉద్యోగి అజయ్, మహారాష్ట్ర వ్యాపారి నిఖిల్‌పై బేల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.