హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో పనిచేసే అర్చకులు విదేశాలకు వెళ్లొచ్చాక గర్భగుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు అనర్హులని పేర్కొంటూ గతంలో ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది.
విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులను గర్భాలయంలో అర్చకత్వం నిర్వహించేందుకు అనుమతించరాదంటూ 2010లో ధార్మిక పరిషత్ జారీచేసిన సర్యులర్ను, 2024లో శృంగేరి శారదా పీఠం జగద్గురువులు మహాతీర్థ భారతీ స్వామి జారీచేసిన ప్రమాణాలను అమలు చేయాలని మార్చి 30న సింగిల్ జడ్జి తీర్పు చెప్పారు. దీన్ని సవాలు చేస్తూ సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు దాఖలు చేసిన అప్పీల్పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ లీసా గిల్, జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం.. సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలిపివేసింది.
ఈ విషయంలో దేవాదాయ శాఖ అధికారులు కీలక వాస్తవాలను సింగిల్ జడ్జి దృష్టికి తీసుకురాలేదని, అందువల్ల ఆ ఉత్తర్వుల అమలుపై స్టే విధిస్తున్నామని స్పష్టం చేసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మళ్లీ విచారణ జరుపాలని, ఆ తర్వాతే తగిన నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జిడని ఆదేశించింది.