SLBC | నాగర్‌కర్నూల్ : శ్రీశైలం వద్ద ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలో గల్లంతైన కార్మికులు, ఇంజినీర్ల వారిని గుర్తించడంలో కొంత పురోగతి లభించింది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డీ-2 పాయింట్లో కార్మికుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగిస్తున్నారు. గల్లంతైన వారిలో కొందరిని నేడు సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉంది. ఆనవాళ్లు లభించడాన్ని అధికారులు ఇంకా ధృవీకరించలేదు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి మృతదేహాలను గుర్తించేందుకు కేరళ నుంచి తీసుకొచ్చిన క్యాడవర్ డాగ్స్ ఇప్పుడు పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇతర రాష్ర్టాలు, నిఘా సంస్థలకు కూడా జాగిలాలకు శిక్షణ ఇచ్చి పంపిస్తున్న తెలంగాణలో.. అటువంటి డాగ్స్ లేకపోవడం చర్చనీయాంశమైంది.
‘మన ఇంటి కుక్క పసిగట్టదా?’ అంటూ పలువురు పోలీసులు ప్రశ్నించుకుంటున్నారు. ఇప్పటికే ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి వెళ్లిన తెలంగాణ స్నిఫర్‌డాగ్స్ ఎలాంటి ఫలితాలు రాబట్టకుండానే తిరిగి వచ్చేశాయి. ఈ క్రమంలో కేరళ క్యాడవర్ డాగ్స్ ఇప్పటికే మృతదేహాల స్పాట్లను గుర్తించినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణలో శిక్షణ పొందిన ఇతర జాతి జాగిలాలకు కూడా అటువంటి శిక్షణ ఇప్పించాల్సిన అవసరంపై చర్చలు కొనసాగుతున్నట్టు తెలిసింది.