SLBC | మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘మూన్నెళ్లుగా జీతాలు ఇవ్వడం లేదు. అడిగితే భయపెట్టిస్తున్నారు. మా కండ్ల ముందే మా వాళ్లను పోగొట్టుకోవాల్సి వచ్చింది. భయంతో మేము ఉంటే, మళ్లీ లోనికి వచ్చి పనిచేయాలంటున్నరు. మేము పని చేయలేం. చేసిన పనికి డబ్బులు ఇచ్చేస్తే మా ఊరికి వెళ్లిపోతాం..’ అని పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం ఎస్ఎల్బీసీ టన్నెల్లో కార్మికులు చిక్కుకుపోగా పరిశీలించేందుకు వచ్చి తిరిగి వెళ్తున్న మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు బీఆర్ఎస్ బృందం అక్కడే సమీపంలోని షెడ్లో ఉన్న కార్మికుల వద్దకు వెళ్లి, వారితో కొద్దిసేపు మాట్లాడారు.
కార్మికుల సమస్యలు, ప్రమాదం జరిగిన తీరు, కారణాలను అడిగి తెలుసుకున్నారు. ‘కొన్ని రోజులుగా పైనుంచి నీళ్లుకారుతున్నాయి. మట్టిపెల్లలు ఊడిపడుతున్నాయి. శనివారం రాత్రి నైట్‌షిఫ్ట్‌లో నేను పనిచేసేందుకు వెళ్లగా, అప్పుడు పైనుంచి మట్టిపెల్లలు, రాళ్లు పడటం, నీళ్లు కారడం ఎక్కువైంది. ఉదయం షిఫ్ట్‌లో వచ్చిన మాతోటి కార్మికులకు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నదని చెప్పి, చూపించి జాగ్రత్తగా ఉండాలని చెప్పినం’.. అని కార్మికుడు ముత్తుసాహూతోపాటు మరికొందరు కార్మికులు ప్రమాదం జరిగిన తీరును హరీశ్‌రావుకు వివరించారు. చాలామంది కార్మికులు వెళ్లిపోయారని, తమ వద్ద చార్జీకి డబ్బులు కూడా లేవని ఆవేదన వ్యక్తంచేశారు. వీరికి హరీశ్‌రావు మనోధైర్యం కల్పించారు. కార్మికులు భయంతో ఉన్నారని, వారికి మూడునెలల కూలి డబ్బులు ఇప్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.