హైదరాబాద్, అక్టోబర్16 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ పనులను పూర్తిచేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లోని ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో జలసౌధలో బుధవారం ప్రత్యేకంగా సమీక్షించారు. మొత్తం 44 కి.మీ, ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో ఇంకా 9.5 కీమీ టన్నెల్ బోరింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు. పనుల పూర్తికి అవసరమైన కీలక యంత్రాలను దిగుమతి చేసుకోవాలని, టన్నెల్ పూర్తయితే దాదాపు రూ.200 కోట్ల మేరకు లిఫ్టింగ్ ఖర్చులను ఆదా చేయవచ్చని తెలిపారు. నకలగండ ప్రాజెక్ట్ కూడా వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల పురోగతిపైనా సమీక్షించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు బాలునాయక్, బీ లక్ష్మారెడ్డి, నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఎల్ఏ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.