ఎటు చూసినా బురద.. మట్టి.. రాళ్లు.. శిథిలాల గుట్టలు.. ఉబికివస్తున్న ఊటనీరు.. శిథిలాల మధ్య కూరుకుపోయిన టన్నెల్బోర్ మిషన్ వెనుకభాగం.. వంగిపోయిన వెంటిలేషన్ ట్యూబ్.. చుట్టూ చిమ్మచీకటి.. పైగా కరెంటు సౌకర్యమూ లేదు.. ఇదీ ఎస్ఎల్బీసీ సొరంగం లోని భయానక పరిస్థితి. దాదాపు 150 మీటర్ల మేర టన్నెల్ కూలిందని గుర్తించగా.. ఇప్పుడున్న స్థితిలో అక్కడికి మానవమాత్రులెవరూ అడుగుపెట్టలేని దుర్భర స్థితి నెలకొన్నది. నీళ్లు తోడలేరు.. మట్టి దిబ్బల్ని ముట్టుకోలేరు. శిథిలాలు తొలగించలేరు.. టన్నెల్‌ను ఎక్కడ తాకితే ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో, ఉపరితలం ఇంకెంత కూలుతుందో తెలియని స్థితి. దీంతో సహాయ చర్యల్లో ప్రతిష్ఠంభన ఏర్పడింది.
A. టన్నెల్లో లోకో ట్రాక్‌తో వెళ్లగలుగుతున్నది ఈ12 కి.మీ. వరకే
B. అందుబాటులో ఉన్న మొత్తం లోకో ట్రాక్ పొడవు 13.5 కి.మీ.
C. అవక్షేపాలు, శిథిలాలతో నిండిన ప్రాంతం
D. రెస్క్యూ సిబ్బంది చేరుకున్న పాయింట్ (దాదాపు 13.790 కి.మీ.)
SLBC Tunnel Collapse | మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ కనుగొనేందుకు రెస్క్యూ టీం చేపట్టిన ఆపరేషన్‌కు అక్కడి పరిస్థితులు అడ్డంకిగా మారాయి. ప్రమాదం జరగిన ప్రాంతంలో నీళ్లు ఉబికి వస్తుండటం, బురద ఎక్కువగా ఉండటం, విద్యుత్తు సౌకర్యం లేకపోవడంతో రెస్య్యూ టీంకు అత్యంత సమస్యాత్మకంగా మారింది. పైభాగంలో పెద్ద ఎత్తున జలరాశి ఉన్నదని, పై నుంచి సొరంగంలోకి వెళ్లే అవకాశం ఏమాత్రం లేదని, అక్కడ ముట్టుకుంటే కూలిపోయే ప్రమాదం ఉన్నదంటూ నేషనల్ జియోగ్రాఫిక్ సర్వే ఏజెన్సీ నివేదిక ఇచ్చింది. మరోవైపు సొరంగంలో లైనింగ్ లేని చోట డ్రిల్లింగ్ చేసిన ప్రదేశం కూడా ఏ క్షణమైనా మళ్లీ కూలవచ్చని అంచనా వేస్తున్నారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య రెస్క్యూ టీంలు ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లలేకపోతున్నాయి. ప్రమాదం జరిగిన 14వ కిలోమీటర్‌కు 40 మీటర్ల ఇవతలే ఆగిపోతున్నాయి.
సొరంగం లోపల విద్యుత్తు సౌకర్యం నిలిచిపోవడం, కన్వేయర్ బెల్టు తెగిపోవడం, ఉబికి వస్తున్న నీరు, బురద.. సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారాయి. నాలుగు రోజుల తర్వాత చివరకు సొరంగం పక్క నుంచి ప్రమాదం జరిగిన జీరో పాయింట్ వరకు వెళ్లడానికి దారి ఏర్పాటు చేసుకున్నప్పటికీ, అక్కడ కూడా నీళ్లు ఉబికి వస్తుండటంతో రెస్క్యూ బృందాలకు సవాల్‌గా మారింది. మరోవైపు సహాయక చర్యలు చేపడుతున్న బృందాల మధ్య సమన్వయం కొరవడంతో అసలు సొరంగంలో ఏం జరుగుతున్నదో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. మంగళవారం ఉదయం 9 గంటలకు ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ నేవీ, ర్యాట్ మైనర్స్ టీంలు టన్నెల్లోకి వెళ్లాయి. కానీ, అక్కడున్న ప్రతికూల పరిస్థితులు రెస్క్యూ ఆపరేషన్‌కు విఘాతం కలిగిస్తున్నాయి.
మరోవైపు, ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్లాలని ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. మరో ఎస్కేప్ టన్నెల్ ఏర్పాటుకు సమయం ఎక్కువ పడుతుందన్న ఉద్దేశంతో ఆ ఆలోచన విరమించారు. ఇంకోవైపు జియోలాజికల్ సర్వే రిపోర్టు ఆధారంగా 14వ కిలోమీటర్ పైభాగంలో డ్రిల్లింగ్ చేసే ప్రతిపాదన వచ్చింది. దీని సాధ్యాసాధ్యాలపై ఇంకా ఒక కొలిక్కి రాలేదు. సొరంగం లోపల భారీ మిషనరీతో బురద, టన్నెల్ బోరింగ్ మిషన్ సామగ్రిని బయటకి తీయాలంటే అది కూడా సాధ్యపడటం లేదు. బృందాలు సాహసం చేసి లోపలికి వెళ్లాలన్నా ఆ నలభై మీటర్ల వద్ద సొరంగ మార్గం దగ్గర సుమారు ఆరు మీటర్ల వరకు బురద నిండిపోయింది. ఉబికి వస్తున్న నీటి ఊట, విద్యుత్తు సౌకర్యం లేకపోవడం దీనికి తోడై సహాయక చర్యలు మందగించాయి.
ఎస్ఎల్బీసీలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన ఇండియన్ నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ మైనర్ టీంలు మంగళవారం ఉదయం సొరంగంలోకి ప్రవేశించాయి. అక్కడ పేరుకుపోయిన బురద, ఉబికి వస్తున్న నీరు సహాయక చర్యలకు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడం, దాదాపుగా నాలుగు గంటలు శ్రమించినా ఫలితం లేకపోవడంతో సాయంత్రం 7 గంటలకు తిరిగి బయటకు వచ్చారు. అక్కడి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని, సహాయక చర్యలకు ఏమాత్రం సహకరించడం లేదని చెప్తున్నారు. ఈ బృందం వెంట వెళ్లిన నవయుగ ఇంజినీరింగ్ కంపెనీకి చెందిన ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన 14 కిలోమీటర్ల వద్ద సొరంగంలో నాలుగు నుంచి ఆరు మీటర్ల బురద పేరుకుపోయిందని, పైనుంచి మట్టి, నీరు వస్తూనే ఉన్నదని చెప్పారు. మానవమాత్రులు ఎవరూ అక్కడ సహాయక చర్యల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయిందని, పరోక్షంగా ఒప్పుకొన్నారు. మరోవైపు సొరంగంలో లైనింగ్ లేని చోట డ్రిల్లింగ్ చేసిన ప్రదేశం కూడా ఏ క్షణమైనా మళ్లీ కూలవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే సొరంగంలో సహాయక చర్యలు మరింత కఠినతరం అవుతాయని వారు భావిస్తున్నారు.
ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారి బంధువులు మంగళవారం జార్ఖండ్ నుంచి ప్రత్యేక వాహనంలో ఇక్కడికి వచ్చారు. అక్కడి జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు మైనింగ్ ఆఫీసర్ అవినాశ్ నేతృత్వంలో జార్ఖండ్‌కు చెందిన నలుగురు బాధితులు దోమల పెంటకు చేరుకున్నారు. వారిని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోశ్‌కు పరిచయం చేశారు. కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు ఇక్కడ జరుగుతున్న సహాయక చర్యలను వివరించారు. అయితే బయట పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండటంతో వారు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. కనీసం తమ వారి శవాలనైనా ఇస్తారా? లేదా? అని మీడియా ముందు ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో పోలీసులు వారిని హుటాహుటిన లోపలికి తరలించారు. అయితే, సొరంగంలో చిక్కుకున్నవారి బంధువులు వచ్చారని తెలిసి కూడా మంత్రులు ఎవరూ వారివైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగినరోజు నుంచి సహాయక చర్యలకు వినియోగిస్తున్న 11 టీంలను సమన్వయపరిచే విషయంలో అధికారులు విఫలమయ్యారు. లోపలికి వెళ్లిన ప్రతి టీం రావ డం, పోవడం, అక్కడి పరిస్థితులు వివరించడం వరకే సరిపోయింది. మున్ముందు ఏంచేయాలనే దానిపై స్పష్టత కొరవడింది. మంత్రులు ఇలా వచ్చి అలా వెళ్లిపోతుండటంతో సహాయక చర్యల్లో వేగం ఆశించినంతగా ఉండటం లేదు. లోపల చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం కనుచూపు మేర కనిపించడం లేదని.. పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో చెప్పారు. సహాయక చర్యలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నదని అంటున్నారు.
సొరంగంలో నీటి ఊటకి సంబంధించి నేషనల్ జియోగ్రాఫిక్ సర్వే ఏజెన్సీ క్షుణ్ణంగా లోపలికి వెళ్లి పరిశీలించింది. 14వ కిలోమీటర్ల వద్ద ఉన్న గుట్టను కూడా పూర్తిగా పరిశీలించింది. పై భాగంలో పెద్ద ఎత్తున జలరాశి ఉన్నదని, దీంతో సొరంగంలోకి నీళ్లు ప్రవేశిస్తున్నాయని తేల్చారు. పైనుంచి ఏ మాత్రం సొరంగంలోకి వెళ్లే అవకాశం లేదని, అలా అయితే సొరంగం మొత్తం కుప్పకూలే అవకాశం ఉన్నదని నివేదిక ఇచ్చారు. సొరంగం లోపల, చుట్టుపక్కల లైనింగ్ నుంచి కూడా నీటి ధార వస్తున్నదని, ఇది కూడా సొరంగానికి ప్రమాదకర స్థాయిలోనే ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయిందని చెప్తున్నారు.
దోమలపెంట టన్నెల్ ప్రమాద ఘటనలో సొరంగంలో చిక్కుకున్న బాధితుల కుటుంబసభ్యుల ఆవేదన వర్ణనాతీతం. నాలుగు రోజులుగా సహాయక చర్యలు చేపడుతున్నామని అధికారులు చెప్తున్నారని, కానీ, ఇక్కడ చూస్తే వారు సఫలీకృతం చెందేలా కనిపించడం లేదని, లోపల చిక్కుకున్న గురుప్రీత్ కుటుంబసభ్యుడు సత్పాల్సింగ్ ఆవేదన వ్యక్తంచేశారు. పంజాబ్‌కు చెందిన గురుప్రీత్‌సింగ్ ఇక్కడ ఆపరేటర్‌గా పనిచేసేవాడని, పేద కుటుంబానికి చెందిన అతని కుటుంబసభ్యులు ఇప్పుడు దిక్కులేని వారిగా మారిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపి బాధితులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ఇతర మార్గాలను చేపట్టాలని ఆయన వేడుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సహాయక చర్యలు సంతృప్తికరంగా లేవని వాపోయారు.