“ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును రెండున్నరేండ్లలో పూర్తి చేస్తాం. ఆ తరువాతనే ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం” అంటూ సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల పదే పదే ప్రకటిస్తున్నారు. సమీక్షల మీద సమీక్షలు పెడుతున్నారు. కానీ ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇన్లెట్ టన్నెల్ కుప్పుకూలింది. టీబీఎం ధ్వంసమైంది. ఇక అవుట్లెట్ టన్నెల్‌లోని టీబీఎంను సైతం ఏ పార్ట్‌కు ఆ పార్ట్‌ను తొలగిస్తున్నారు. మరోవైపు నిర్మాణ ఏజెన్సీ దివాళా తీసింది. డీబీఎం పద్ధతిలో పనులను చేపట్టేందుకు హడావుడి చేసినా, పనుల నిర్వహణకు కంపెనీతో కలిసి ఎస్క్రో అకౌంట్ తెరువాలని నిర్ణయించినా అదీ ముందుకు సాగడం లేదు. ఎస్క్రో అకౌంట్ ఇప్పట్లో అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వెరసి పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి నెలకొన్నది.
హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నల్లగొండ జిల్లాకు కృష్ణా జలాలను తరలించేందుకు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు రూపొందించారు. రిజర్వాయర్ నుంచి దిండి రిజర్వాయర్ వరకు మొత్తంగా 43.50 కిలోమీటర్ల సొరంగాన్ని తవ్వాల్సి ఉన్నది. ఏకకాలంలో రెండువైపుల నుంచి ఇన్లెట్ అంటే అచ్చంపేట మండలం దోమలపెంట వద్ద శ్రీశైలం రిజర్వాయర్ గట్టు నుంచి, ఔట్లెట్ అంటే మహబూబ్‌నగర్ జిల్లా మన్యవారిపల్లె నుంచి సొరంగం పనులు చేపట్టారు. ఇన్లెట్ వైపు నుంచి 13.93 కిలోమీటర్ల సొరంగం తవ్వగా, 2025 ఫిబ్రవరి 22న సంభవించిన ప్రమాదంతో ఆ పనులు నిలిచిపోయాయి. దాదాపు 50 మీటర్ల మేర పేరుకుపోయిన శిథిలాలు, మట్టి, రాళ్లను కూడా తొలగించలేని దుస్థితి. ప్రమాదంలో టీబీఎం పూర్తిగా ధ్వంసమైంది.
మున్ముందు కూడా మరిన్ని షీర్ (పగులువారిన రాతిపొరలు) జోన్లు ఉన్నాయని అధికారులు ఇప్పటికే వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పనులను కొనసాగించాలంటే ప్రమాద స్థలాన్ని తప్పిస్తూ పక్కనుంచి మరో టన్నెల్ నిర్మించి ఔట్లెట్ టన్నెల్‌కు కలుపాలని నిర్ణయించారు. 300 మీటర్లకు వెనక్కి వచ్చి అక్కడి నుంచి పక్కగా టన్నెల్ తవ్వుతూ ఔట్లెట్ టన్నెల్‌కు కలుపాలని ప్రణాళిక సిద్ధంచేశారు. టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) పద్ధతిలో కాకుండా డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ (డీబీఎం) మెథడ్‌లో పనుల నిర్వహణకుగాను ప్రభుత్వం ఇప్పటికే నిపుణులు హర్పాల్సింగ్, పరీక్షిత్ మెహ్రాలను నియమించింది. టన్నెల్ నిర్మాణం కోసం నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్సింగ్, టన్నెల్ స్పెషలిస్టు కల్నల్ పరీక్షిత్ పర్యవేక్షణలో హెలిబోర్న్ మాగ్నెటిక్ సర్వే ఇటీవలనే నిర్వహించారు. భూమికి అడుగున 1,000 మీటర్ల లోతు వరకు ఉన్న జియోలాజికల్ కండిషన్ డాటా సేకరించారు. కానీ, ఇంతవరకు ఎన్జీఆర్ఐ అందుకు సంబంధించిన నివేదికను సమర్పించలేదు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ 44 కిలోమీటర్ల పొడవు. దానికి రెండువైపుల నుంచి టీబీఎం టెక్నాలజీతో పనులు చేపట్టేందుకు జయప్రకాశ్ అసోసియేట్ కంపెనీ కాంట్రాక్ట్ చేజికించుకున్నది. టీబీఎం టెక్నాలజీతో పనులు నిర్వహించిన అనుభవం కానీ, టెక్నాలజీ కానీ జేపీ అసోసియేట్స్‌కు సొంతంగా లేదు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన రాబిన్స్సన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నది. జాయింట్ వెంచర్‌గానే ఎస్ఎల్బీసీ పనులను 2005-06లో చేపట్టింది. అప్పటికీ కంపెనీ లాభాల్లోనే ఉన్నది. ఆదిలో పనులు సజావుగా కొనసాగాయి. టీబీఎంలు కొత్తవి కావడం, కంపెనీ సైతం లాభాల్లో ఉండటంతో టన్నెల్ పనులు వడివడిగానే కొనసాగాయి. కానీ, 2009 నాటికి జయప్రకాశ్ కంపెనీ నష్టాల్లోకి జారుకున్నది. ఇది మొదలు ఎస్ఎల్బీసీ పనులు మందకొడిగా సాగడం మొదలైంది. వాణిజ్యపరంగా నష్టాల్లోకి కూరుకుపోయిన జేపీ కంపెనీ ఎస్ఎల్బీసీ పనుల వేగాన్ని తగ్గించింది. కంపెనీ ఆర్థిక పరిస్థితిని అర్థంచేసుకున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక విధాలుగా వెసులుబాటు కల్పించింది.
విద్యుత్తు బిల్లుల చెల్లింపు, ఒప్పంద ధరల మార్పునకు అవకాశం కల్పించింది. అయినప్పటికీ, కంపెనీ మాత్రం పనులను ముందుకు తీసుకుపోని దుస్థితి నెలకొన్నది. అడిగినా ప్రతిసారీ నిధులలేమి అంటూ చేతులు ఎత్తేసింది. ఒకవేళ ప్రభుత్వం నిధులు చెల్లించినా వాటిని కంపెనీ తన సొంతానికి వాడుకుంటూ, ఎప్పటికప్పుడు నష్టాలు పూడ్చుకోవడానికి వినియోగించింది తప్ప పనుల నిర్వహణకు వినియోగించింది తకువ. ఒప్పందం చేసుకున్న రాబిన్స్సన్స్ కంపెనీకి సకాలంలో చెల్లింపులు చేయకపోవడం పరిపాటిగా మారింది. ఇదేమంటే ఏవేవో సాకులు చూపుతూ పనులను ముందుకు తీసుకుపోవడంలేదని అధికారవర్గాలే చెప్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా టీబీఎం బేరింగ్ దిగుమతి కోసం దాదాపు రూ.100 కోట్లు కంపెనీకి చెల్లించింది. కానీ, బేరింగ్ మాత్రమే తీసుకొచ్చింది.
ఇతర విడిభాగాలను తీసుకొనిరాలేదు. అదేమంటే మళ్లీ నిధులలేమి అంటూ సాకులు చెబుతూ వచ్చింది. మరోవైపు పనులు ప్రారంభించాలని సర్కార్ ఒత్తిడి చేయడంతో కంపెనీ ఔట్‌లెట్‌లోని టీబీఎంకు సంబంధించిన రింగ్గేర్, అడాప్టర్, వింగ్స్ వంటి తదితర విడిభాగాలను ఇన్లెట్ టీబీఎంకు అమర్చి, ఎటువంటి అధ్యయనాలు లేకుండానే ఇన్లెట్లోని పనులు చేపట్టింది. రోజుల వ్యవధిలోనే టన్నెల్ కూలిపోయింది. కంపెనీ, సర్కార్ నిర్వాకం వల్ల ఇన్లెట్ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు మృతిచెందారు. మరోవైపు, ఔట్లెట్ టన్నెల్ వైపున పనులను ప్రారంభించాలన్నా టీబీఎం విడిభాగాలు లేని పరిస్థితి. ఆ విడిభాగాలను తెప్పించాలంటే మరో రూ.70 కోట్లు అవసరమని అంచనా. ఆ నిధులను మంజూరు చేస్తే పనులను ప్రారంభిస్తామంటూ కంపెనీ మరోసారి మెలిక పెట్టింది. ఇలా నిత్యం ఏదో ఒక సాకు చెప్పడం, ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే వాటిని సొంతానికి వాడుకోవడం కంపెనీకి పరిపాటిగా మారింది.
రెండేండ్లుగా కంపెనీ తీరుతో విసుగెత్తిన కాంగ్రెస్ సర్కార్.. తుదకు పనులను ఎస్క్రో అకౌంట్ ద్వారా కొనసాగించాలని నిర్ణయించింది. అంటే గుత్తేదారు, ప్రభుత్వం కలిసి బ్యాంకులో ప్రాజెక్టు పనులకు సంబంధించి జాయింట్ అకౌంట్ తెరుస్తాయి. ప్రభుత్వం విడుదల చేసే నిధులన్నీ ఆ అకౌంట్లోనే జమవుతాయి. ఆ నిధులను నిర్దేశిత ప్రాజెక్టు పనులకే వినియోగించాల్సి ఉంటుంది. అందుకోసం మాత్రమే బ్యాంకు విడుదల చేస్తుంది. అంతవరకు బాగానే ఉన్నా, ఇప్పుడు ఎస్క్రో అకౌంట్ తెరవడమే అసాధ్యమని ఇంజినీర్లు చెప్తున్నారు. ఎందుకంటే, జేపీ అసోసియేట్స్ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయి ఉన్నది. కంపెనీకి రుణాలు ఇచ్చిన ఎస్బీఐ, ఐసీఐసీఐ తదితర బ్యాంకులు, సంస్థలు కలిసి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించాయి. దీంతో ఎన్సీఎల్టీ.. జేపీ కంపెనీని కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రకియకు (సీఐఆర్‌పీ)కి 2024లో అనుమతిచ్చింది. అందులోభాగంగా కంపెనీ తరఫున ఒక నిపుణుడిని నియమించింది.
ప్రస్తుతం ఎన్సీఎల్టీ నియమించిన సదరు మధ్యవర్తి ఆధ్వర్యంలోనే జేపీ అసోసియేట్స్ లావాదేవీలు కొనసాగుతున్నాయి. సూటిగా చెప్పాలంటే ఎస్క్రో అకౌంట్‌ను ఓపెన్ చేయడానికి జేపీ కంపెనీ డైరెక్టర్లకు, చైర్మన్‌కు ఎలాంటి అధికారాలు లేవు. ఎన్సీఎల్టీ నియమించిన మధ్యవర్తికే సర్వాధికారాలు ఉన్నాయి. ఆయన అనుమతిస్తేనే అకౌంట్ తెరిచేందుకు బ్యాంకులు సమ్మతిస్తాయి. అందుకు ఎన్సీఎల్టీ అనుమతి తప్పనిసరి. ఆ ప్రక్రియకు సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉన్నదని అధికారులు చెప్తున్నారు. మరోవైపు, జేపీ అసోసియేట్స్ దివాలా పరిష్కారానికి రూ.15 వేల కోట్లతో అదాని గ్రూప్ ముందుకొచ్చింది. ఆ ప్రణాళికకు సీఐఆర్‌పీ ప్రక్రియలో భాగంగా నియమించిన క్రెడిటర్స్ గ్రూపు సైతం ఇటీవల ఆమోదించింది. త్వరలోనే జేపీ అసోసియేట్స్‌ను అదానీ టేకోవర్ చేసే అవకాశం ఉన్నది. ఈ పరిస్థితిలో ఎస్క్రో అకౌంట్ తెరువడం అసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వెరసి ఎస్ఎల్బీసీ పనులు మళ్లీ ప్రశ్నార్థకంగా మారాయి. ఎప్పుడు మొదలవుతాయనేది తెలియని పరిస్థితి తలెత్తింది.
ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఔట్లెట్లో ప్రస్తుత టీబీఎంకు సంబంధించిన విడిభాగాలను తెప్పించి తద్వారా పనులను ప్రారంభించేందుకు కూడా ప్రస్తుతం అవకాశం లేకుండా పోయిందని తెలుస్తున్నది. ఇన్‌లెట్‌లో ఉన్న తరహాలోనే ఔట్లెట్ వైపు కూడా షియర్ జోన్లు ఉన్నట్టు గుర్తించారు. ఔట్లెట్ వద్ద నుంచి ప్రస్తుతం 21 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. అకడినుంచి ఒక కిలోమీటర్ దూరంలో టన్నెల్ కొండపైన నల్లవాగు క్రాసింగ్ ఉన్నట్టు తేల్చారు. టన్నెల్ నుంచి 350 మీటర్ల ఎత్తులో ఆ క్రాసింగ్ వెళ్తున్నట్టు గుర్తించినట్టు తెలిసింది.
టీబీఎం ద్వారా పనులు చేపడితే ముందు ఏమున్నదో తెలుసుకునే అవకాశం లేకుండా పోతుంది. ఫలితంగానే ఇన్లెట్ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తున్నది. ఇప్పుడు ఔట్లెట్ వద్ద కూడా టీబీఎంతో పనులు చేయిస్తే మళ్లీ అలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అకడ కూడా టీబీఎంతో కాకుండా డీబీఎం పద్ధతిలోనే పనులు చేపట్టాలని నిర్ణయించారు. కానీ, నిధులిస్తేనే పనులు చేపడుతామని కంపెనీ కొర్రీలు పెడుతుండటంతో ఆ ప్రక్రియ సైతం ముందుకు సాగని దుస్థితి నెలకొన్నది. వెరసి మొత్తంగా ఎస్ఎల్బీసీ పనులు ఎప్పుడు మొదలవుతాయో తెలియని దుస్థితి నెలకొన్నది.