హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తేతెలంగాణ) : బీఆర్ఎస్ రజతోత్సవ సభలో అంశాలవారీగా కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకే మంత్రులు కారుకూతలు కూస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎల్కతుర్తి సభ విజయవంతం కావడం కాంగ్రెస్ సర్కారుకు చెంపపెట్టు అని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యం, అబద్ధపు హామీలు, దౌర్జన్యాలు పెరిగిపోయిన నేపథ్యంలోనే సభకు అంచనాలకు మించి ప్రజలు తరలివచ్చారని తెలిపారు. 17 నెలల్లో తెలంగాణను అన్నిరంగాల్లో ఆగం చేసిన కాంగ్రెస్‌ను కేసీఆర్ ఓరుగల్లు వేదికగా ఎండగట్టారని తెలిపారు. సభకు ఎన్ని ఆటంకాలు సృష్టించినా జనం ముందు సర్కారు ఆటలు సాగలేదని స్పష్టంచేశారు. ఈ సభతో యావత్ తెలంగాణ కేసీఆర్ వెన్నంటి ఉన్నదనే విషయం రుజువైందని తెలిపారు. ఆహోరాత్రులు కష్టపడి సభను జయప్రదం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.