Telangana | ఆయిల్‌పామ్ సాగు కోసం మూడేండ్లుగా రూ.కోట్ల పెట్టుబడి పెట్టారు.. ఇప్పుడిప్పుడే పంట చేతికొస్తున్నది.. ఈ సమయంలో ఆ కంపెనీపై ఓ మంత్రి బంధువుల కన్నుపడింది. ఇంకేముంది..! ఆ కంపెనీని తమకు అమ్మేయాలంటూ సదరు కంపెనీ ప్రతినిధులపై బెదిరింపులకు దిగుతున్నారు. ఆయిల్‌పామ్ సాగులో భాగస్వామ్యమైన ప్రీ యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఓ మంత్రి బంధువుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నట్టు విశ్వసయనీయంగా తెలిసింది.
హైదరాబాద్, ఆగస్టు 18(నమస్తే తెలంగాణ): ఆయిల్ పాం కంపెనీని తమకు విక్రయించాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. దీనికి మంత్రి కూడా వత్తాసు పలుకుతున్నట్టు తెలిసింది. తన మేనల్లుడు, కొడుకుకు కంపెనీని కట్టబెట్టేందుకు తనవంతుగా ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును పెంచేందుకు గత ప్రభుత్వం జిల్లాలవారీగా కంపెనీలను ఎంపిక చేసింది. ఇందులో ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ఫెడ్తో పాటు మరో 14 కంపెనీలున్నాయి.
ఈ కంపెనీల్లో ఒకటి ప్రీ యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీకి 2021లో ఏడు జిల్లాలు నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి, ఆదిలాబాద్ జిల్లాలు కేటాయించారు. సుమారు 40 వేల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్ మొక్కల్ని నాటించింది. ఇప్పుడిప్పుడే గెలల కాత మొదలైంది. ఈ సమయంలో కంపెనీని కబ్జా చేసేందుకు ఓ మంత్రి మేనల్లుడు, కొడుకు కలిసి స్కెచ్ వేసినట్టు తెలిసింది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వంలో పెద్దస్థాయిలో చర్చ జరగ్గా ఇందుకు ఆ శాఖ ఉన్నతాధికారి అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. అలా చేయడం కుదరదని తేల్చిచెప్పినట్టు తెలిసింది. అయినా సదరు మంత్రి బంధువులు మాత్రం తీవ్ర ఒత్తిడి చే స్తూ వారి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నట్టు సమాచారం.