ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కనుగొనేందుకు నిన్నటిదాకా తటపటాయించిన రాష్ట్ర ప్రభుత్వంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. బీఆర్ఎస్ ప్రతినిధుల బృందంతో గురువారం ఘటనా స్థలం వద్దకు వెళ్లిన హరీశ్‌రావు, ఆరు రోజులుగా ఎందుకు సరైన చర్యలు చేపట్టలేదని నిలదీయడం, సొరంగం వద్ద బృందాలను కలిసి రెస్క్యూ ఆపరేషన్ ఎందుకు డీలా అవుతున్నదని, కన్వేయర్ బెల్టు రిపేరు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించడంతో నీళ్లు నమలడం అధికారులవంతైంది.
ఇప్పటికే సర్కారు నిర్లక్ష్యంపై విమర్శలు రావడం, బీఆర్ఎస్ తీవ్ర ఒత్తిడి తేవడంతో ఆరు రోజులకు అసలైన రెస్యూ ఆపరేషన్ మొదలైంది. సహాయ బృందాలకు స్వయం నిర్ణయాధికారం తీసుకునే స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించడంతో ఆపరేషన్ వేగవంతమైంది. మట్టి దిబ్బల కింద ఇరుక్కుపోయిన టీబీఎం మిషన్‌ను కట్ చేస్తూ సొరంగంలో పేరుకుపోయిన బురదను లోకో ట్రైన్లో బయటకి తరలిస్తూ బృందాలు ముందుకు పోతున్నాయి. ప్రమాదం జరిగి ఇన్ని రోజులు గడిచినా తమ వాళ్లను బయటకు తీసుకురాకపోవడంతో ఆవేదనతో కూలీలు స్వరాష్ర్టాలకు తరలిపోవడం కనిపించింది.
SLBC Tunnel | మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎస్ఎల్బీసీ సొరంగంలో ఆరు రోజుల తర్వాత అసలు రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది. సొరంగంలో యుద్ధప్రాతిపదికన చర్యలు కొనసాగుతున్నాయి. టీబీఎం యంత్ర పరికరాలను కట్ చేస్తూ, బురదను తొలగిస్తూ సహాయక బృందాలు ముందుకు సాగుతున్నాయి. మాజీ మంత్రి హరీశ్‌రావు రాకతో సర్కారులో కదలిక వచ్చింది. ఏకంగా సహాయక బృందాలకు స్వయం నిర్ణయాధికారం తీసుకునే స్వేచ్ఛను కల్పించింది. నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాద ఘటనపై ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది.
హరీశ్‌రావు ప్రమాద ఘటనా స్థలాన్ని సందర్శించిన అనంతరం రెస్క్యూ ఆపరేషన్ వేగంగా సాగుతున్నది. దీంతో ఆరో రోజైన గురువారం చకచకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలో చిక్కుకున్న టీబీఎం మిషన్ పరికరాలను రైల్వే శాఖకు చెందిన భారీ ప్లాస్మా కట్టర్లతో కట్ చేస్తున్నారు. మరోవైపు పేరుకుపోయిన బురదను లోకో ట్రైన్లో బయటకు తరలిస్తున్నారు. చెల్లాచెదురుగా పడి ఉన్న శిథిలాలను బయటకు చేరవేస్తున్నారు.
ముందుగా 12వ కిలోమీటర్ వద్ద పేరుకుపోయిన బురదను తొలగించి ముందుకు వెళ్తున్నారు. భారీ పంపు మోటర్లతో నీటిని తొలగిస్తున్నారు. యుద్ధప్రాతిపదికన బృందాలు ఏ పనులు చేయాలో ముందే నిర్ణయించుకొని సొరంగమార్గంలో వెళ్లి ఆయా పనులను ముగిస్తున్నారు. సహాయక చర్యలు ఆశాజనకంగా సాగుతుండటంతో మరికొన్ని గంటల్లోనే కార్మికుల జాడను తెలుసుకుంటామని ఉన్నతాధికారులు ధీమా వ్యక్తంచేస్తున్నారు.
దక్షిణ మధ్య రైల్వేకు చెందిన భారీ ప్లాస్మా కటింగ్ మిషన్‌తో టీబీఎం యంత్ర పరికరాలను ముక్కలుగా కట్ చేసి బయటకు తరలిస్తున్నారు. సహాయక బృందాలు రాత్రి, పగలు నిర్విరామంగా కష్టపడుతున్నారు. టన్నెల్లో ఉన్న నీటిని భారీ పంపులతో బయటకు తోడుతున్నారు. ట్రైన్లో అమర్చిన పెద్ద కంటైనర్లలో బురదను బయటకు తరలిస్తున్నారు. సుమా రు 10 వేల క్యూబిక్ మీటర్ల బురద ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, ర్యాట్ మైనర్స్, దక్షిణ మధ్య రైల్వే ప్లాస్మా కట్టర్స్, రాబిన్సన్ మైనింగ్ ప్రతినిధులు, మెగా, నవయుగ తదితర కంపెనీల బృందాలు నిరంతరం సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నట్టు జిల్లా కలెక్టర్ సంతోష్ మీడియాకు వివరించారు. బురద నీటిని తొలగించే ప్రక్రియ పూర్తి కావడానికి రెండు రోజులు పట్టే అవకాశం ఉన్నదని తెలిపారు.
ఇండియా బోర్డర్స్ ఆర్గనైజేషన్ సేవలను ఉపయోగిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై రెస్క్యూ టీంలు దృష్టి సారించడంతో తొలగింపు ప్రక్రియ వేగంగా సాగుతున్నది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రెస్క్యూ బృందాలకు వెసులుబాటు కల్పించడంతో ఆయా బృందాలు తమ పనిని సాఫీగా చేసుకుంటున్నాయి. కార్మికులు చిక్కుకున్న ప్రదేశాన్ని రెండు, మూడు రోజుల్లో గుర్తించి బాధితులను బయటకు తీసుకొస్తామని చెప్తున్నారు.
ఎస్ఎల్బీసీ సొరంగం పనులను చేయడానికి వచ్చిన జార్ఖండ్, పంజాబ్, ఒడిశా రాష్ర్టాల కూలీలు ప్రస్తుతం స్వస్థలాలకు తరలి వెళ్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది తమ తోటి కార్మికులను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని కన్నీటిపర్యంతమవుతున్నారు. సుమారు 200 మందికి పైగా కూలీలు ఇతర రాష్ర్టాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు.
ఉదయం నుంచి రాత్రి వరకు రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్న కూలీలకు దినసరి వేతనం కేవలం రూ.600 నుంచి రూ.700 వరకు కంపెనీ చెల్లిస్తున్నది. ప్రమాదకరమైన టన్నెల్లో కష్టపడి పనిచేసినా, యాజమాన్యం సరైన వేతనాలు ఇవ్వడం లేదని కూలీలు వాపోయారు. తమ కండ్లముందే సహచరులు సొరంగంలో చిక్కుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో భవిష్యత్తులో తమకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందేమోనని తలుచుకొని కన్నీరు పెట్టుకుంటున్నారు.
ఒకటి రెండు రోజుల్లో కూలీలందరూ వెళ్లిపోయే అవకాశం ఉన్నది. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ప్రాజెక్టును నిర్మిస్తున్న జయప్రకాశ్ కంపెనీ కూలీల పొట్టలు కొడుతుందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. పనిచేసే చోట కనీస సౌకర్యాలు కల్పించకపోవడాన్ని లేబర్ అధికారులు దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా లేబర్ అధికారులు స్పందించి జయప్రకాశ్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రమాదం జరిగిన ఆరు రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యల్లో వేగం పెంచింది. మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో గురువారం బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఘటనా స్థలానికి చేరుకోవడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఆరు రోజులుగా సరైన చర్యలు ఎందుకు చేపట్టలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. సొరంగం వద్దకు వెళ్లి ఆయా బృందాలను కలిసి రెస్క్యూ ఆపరేషన్‌లో ఎందుకు జాప్యం అవుతున్నదని ప్రశ్నించారు. కన్వేయర్ బెల్ట్ మరమ్మతు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించడంతో అధికారులు నీళ్లు నమిలారు.