వీర్నపల్లి/కోనరావుపేట/ఎల్లారెడ్డిపేట, అక్టోబర్ 28: దుబాయ్‌లో చిక్కుకున్న రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఆరుగురు యువకులు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో స్వస్థలాలకు చేరుకున్నారు. తమను స్వదేశానికి రప్పించాలని వారు 15 రోజుల క్రితం మంత్రి కేటీఆర్‌ను సోషల్ మీడియా ద్వారా వేడుకున్నారు. స్పందించిన కేటీఆర్ వెంటనే ఎంబసీ అధికారులతో మాట్లాడారు. సదరు యువకులు స్వదేశానికి వచ్చేలా ఏర్పా టు చేయాలని గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షుడు గుండెల్లి నర్సింహులుతోనూ మాట్లాడారు. వెంటనే నర్సింహులు కంపెనీ ప్రతినిధులను సంప్రదించి.. యువకులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకునేలా చొరవ చూపారు. అనంతరం మంత్రి కేటీఆర్ సొంత ఖర్చులతో విమాన టికెట్లు ఏర్పాటు చేయగా, గురువారం అర్ధరాత్రి వారు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు గుగులోతు సురేశ్‌నాయక్, టీఆర్ఎస్ వీర్నపల్లి మం డల అధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి, జడ్పీ కోఆప్షన్ చాంద్ పాషా, వీర్నపల్లి సర్పంచ్ పాటి దినకర్, సీనియర్ నాయకుడు నలిమేట చంద్రం శుక్రవారం ఉదయం ఎయిర్‌పోర్టులో వారిని కలిసి.. ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి క్షేమంగా ఇంటికి పంపించారు.
కేటీఆర్ చొరవతోనే ఇంటికి చేరుకున్నాం
మంత్రి కేటీఆర్ చొరవతోనే తాము గల్ఫ్ నుంచి క్షేమంగా స్వదేశానికి సురక్షితంగా చేరుకున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట బాధితులు తెలిపారు. సిరిసిల్లకు చెందిన ఇద్దరు ఏజెంట్ల మోసంతో తాము దుబాయ్‌లో ఎన్నో కష్టాలు పడ్డామని వీర్నపల్లికి చెందిన అరవింద్, నారాయణపూర్‌కు చెందిన పెద్దోళ్ల స్వామి, చందుర్తి మండలం ఎన్గల్ వాసి మరుపాక అనిల్, వెంగల తిరుమలేశ్, కోనరావుపేట మం డలం బావుసాయిపేటకు చెందిన గొల్లపల్లి రాము తెలిపారు. ఈ సందర్భంగా బాధితులతోపాటు వారి కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.