రఘునాథపాలెం/మక్తల్ టౌన్, మే 28 : రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. ఖమ్మం, నారాయణపేట జిల్లాల్లో మంగళవారం జరిగిన ప్రమాదాలకు సంబంధించిన వివరాలు ఇలా.. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బావోజీతండాకు చెందిన బోడా ప్రవీణ్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తూ.. కుటుంబంతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నారు.
ప్రవీణ్‌కు భార్య కుమారి(27), ఇద్దరు ఆడపిల్లలు కృషిక(2), క్రితయన(3) ఉన్నారు. ప్రవీణ్ తన ఇద్దరు పిల్లల ఆధార్ కార్డులను అప్డేట్ చేయించాలని మంగళవారం వారిని కారులో తీసుకొని ఖమ్మం బయలుదేరాడు. ఆధార్ సెంటర్లో కార్డులను అప్డేట్ చేయించిన తరువాత కారులో ఇంటికి బయలుదేరారు. హర్యాతండా సమీపంలో టర్నింగ్ వద్ద కుక్కను తప్పించే క్రమంలో కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న కుమారి, ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. ప్రవీణ్‌కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఖమ్మం దవాఖానకు తరలించారు.
బైక్, బస్సు ఢీకొన్న ఘటనలో నారాయణపేట జిల్లాలో ముగ్గురు మరణించారు. మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మిరెడ్డి కథనం మేరకు.. మక్తల్‌కు చెందిన ఫొటోగ్రాఫర్లు రాఘవేంద్రచారి, వెంకటేశ్‌తోపాటు మహేశ్ మంగళవారం కాచ్‌వార్‌కు బయలుదేరారు. కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు మక్తల్ శివారులో వీరి బైక్‌ను ఢీకొన్నది. దీంతో వెంకటేశ్, రాఘవేంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలైన మహేశ్‌ను దవాఖానకు తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మరణించాడు. బస్సు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.