Heavy Rain | న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాల వల్ల ఇద్దరు బాలలు సహా ఆరుగురు మరణించారు. ముగ్గురు గాయపడ్డారు. డ్రెయిన్లను మూయడంలో, విద్యుత్తు తీగలను సురక్షితంగా ఉంచడంలో అధికారుల నిర్లక్ష్యం అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంది. తనూజ (22), ఆమె మూడేళ్ల కుమారుడు ప్రియాన్ష్ ఘాజీపూర్ ప్రాంతంలో వారపు సంతకు వెళ్లారు. అక్కడ నీటితో పొంగిపొర్లుతున్న కాలువలో పడిపోయి, మునిగిపోయారు. రాజస్థాన్‌లోని మండవర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గాగ్రోన్ వంతెనపై భారీ వరద నీరు ప్రవహిస్తుండగా, బైక్‌పై ప్రయాణించిన ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయారని పోలీసులు తెలిపారు.
ఆగస్టు, సెప్టెంబర్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం
న్యూఢిల్లీ: ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సాధారణం కంటే అధికం వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నదని ఐఎండీ అంచనా వేసింది. ఆగస్టు మాసాంతానికి లానినా పరిస్థితులు మెరుగుపడతాయని, ఫలితంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆగస్టు, సెప్టెంబర్‌లో భారత్‌లో కురిసే వర్షపాతం దీర్ఘకాల సగటు 422.8 మిల్లీమీటర్లలో 108 శాతంగా ఉంటుందని పేర్కొన్నది. జూన్ 1 నుంచి చూసుకుంటే దేశ సగటు వర్షపాతం 445.8 మి.మీ. కాగా ఇప్పటికే 453.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాయువ్య భారతంలో రానున్న ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.
ఉత్తరాఖండ్‌లో ఉప్పొంగిన నదులు
డెహ్రాడూన్, ఆగస్టు 1 : ఉత్తరాఖండ్‌లో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాల వల్ల 14 మంది మరణించారు. ఆరుగురు గాయపడ్డారు. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేదార్నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. కేదార్నాథ్ భక్తులను హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వీరికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసు, జిల్లా అధికారులు సహాయపడుతున్నారు. డెహ్రాడూన్‌లో 24 గంటల్లో 172 మిల్లీ మీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. హరిద్వార్‌లోని రోషనాబాద్‌లో అత్యధికంగా 210 మిల్లీమీటర్లు, రైవాలాలో 163 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.