హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో ఆరు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని, దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, ములుగు, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురువొచ్చని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. ఉదయం ఎండగా అనిపించినా.. మధ్యాహ్నం తర్వాత వాతావరణం చల్లబడుతుందని సాయంత్రానికి వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు. గడిచిన 24 గంటల్లో కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో అత్యధికంగా 2.22 సెం.మీ. వర్షపాతం నమోదైంది.