KCR | హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ) : రేవంత్ సర్కార్ రాజకీయ కక్ష సాధింపుతో పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ ఆదివారం ముగిసింది. ఆరుగురు అధికారులు సుమారు 4 గంటల 45 నిమిషాల పాటు విచారణ జరిపారు. 160 సీఆర్పీసీ కింద సాక్షిగా విచారణ ఎదుర్కొనేందుకు సిట్ నోటీసులు అందుకున్న కేసీఆర్.. నందినగర్‌లోని నివాసంలో తనను విచారించుకోవచ్చని అధికారులకు లేఖ ద్వారా ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంటకు నందినగర్ నివాసానికి చేరుకున్న కేసీఆర్‌ను, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు ఇంట్లోకి తీసుకెళ్లారు.
అంతకుముందే సామగ్రిని తెప్పించుకున్న సిట్ అధికారులు కేసీఆర్ నివాసంలోని రెండో ఫ్లోర్లో విచారణకు ఏర్పాట్లు చేసుకున్నారు. అనంతరం పది నిమిషాల ముందు కేసీఆర్ ఇంటికి చేరుకున్న సిట్ అధికారులు.. మధ్యాహ్నం 3గంటలకు విచారణ ప్రారంభించారు. కేసీఆర్‌ను విచారించిన వారిలో ఐపీఎస్ అధికారి ఎస్ఎం విజయ్‌కుమార్, మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ ఎం రవీందర్‌రెడ్డి, రాజేంద్రనగర్ అడిషనల్ డీసీపీ కేఎస్ రావు, సిట్ విచారణాధికారి పీ వెంకటగిరి, డీఎస్పీ(ఈగల్) సీహెచ్ శ్రీధర్ ఉన్నారు. వీరు పలు అంశాలపై కేసీఆర్ నుంచి సమాధానాలు తీసుకొని.. ఆయన చెప్పే అంశాలను ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేశారు. విచారణ అనంతరం సిట్ అధికారులు నందినగర్ నుంచి వెళ్లిపోయారు.

ఆ తర్వాత ఉదయం నుంచి రాత్రివరకూ తన కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఆయన అభివాదం చేశారు. అనంతరం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి బయల్దేరి వెళ్లారు.తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు కుట్రపూరితంగా సిట్ నోటీసులు ఇచ్చి, విచారణకు పిలువడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఈ మేరకు ఆదివారం బీఆర్ఎస్ నేతలు మన్నె క్రిశాంక్, కిశోర్‌గౌడ్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలియజేశారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్‌పై ఉద్దేశపూర్వకంగా, కక్షా రాజకీయాలతోనే రేవంత్‌రెడ్డి సిట్ నోటీసుల పేరుతో వేధిస్తున్నాడంటూ మండిపడ్డారు.
నిరసనలో భాగంగా సీఎం రేవంత్ దిష్టిబొమ్మను తెలంగాణ భవన్‌పై నుంచి తాడుతో వేలాడదీసి ఉరితీశారు. ఆ తర్వాత ఆ పార్టీ నేత కురువ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో రేవంత్ దిష్టిబొమ్మకు పేగులు మెడలో వేసిన చిత్రాన్ని భవన్లో ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. బీఆర్ఎస్ మహిళా నేతలు సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి వారు సైతం తమ నిరసన ప్రదర్శించారు. మరికొందరు నల్లబ్యాడ్జీలు, నల్లజెండాలతో నిరసన తెలిపారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా అవాస్తవ కథనాలు రాసిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ దిష్టిబొమ్మతో పాటు ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులను సైతం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దహనం చేసి ఆగ్రహంతో కాల్చిబూడిద చేశారు. ఆ పత్రిక పచ్చి రాతలు, కట్టుకథలపై దుమ్మెత్తి పోశారు.

నందినగర్‌కు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
కేసీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు నందినగర్‌కు వెళ్లాలని ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. బారికేడ్లు పెట్టి ఆదివారం ఉదయం నుంచే ఎవరూ అటువైపు రాకుండా నిలువరించడంతో పార్టీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. సాయంత్రం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లి తమ నిరసన తెలుపుదామని ప్రయత్నించగా, వారిని కూడా తెలంగాణ భవన్ వద్ద పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ సర్కార్ వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ సిట్ విచారణ ముగిసిన అనంతరం ఆయన్ను కలిసేందుకు పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో నందినగర్‌లో ఉన్న కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ సైతం బయటకు వచ్చి, తన కోసం వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు. విచారణ నేపథ్యంలో కేసీఆర్‌కు సంఘీభావంగా బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు తెలంగాణ భవన్‌కు పెద్ద సంఖ్యలో ఉదయమే చేరుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే దాకా బీఆర్ఎస్ శ్రేణులంతా సంఘీభావంగా తెలంగాణ భవన్లో తెలంగాణ ఆటపాటలతో గడిపారు.
మహానది ఆగదు.. అలిసిపోదు! మహాశిఖరం తొణకదు..తలవంచదు! ఉక్కుపిడికిలి సడలదు.. వదలదు!కుతంత్రాల విచ్చుకత్తుల మధ్య కూడా అదే ధైర్యం, స్థెర్యం! 5గంటల సిట్ విచారణ తర్వాత కూడా అదే చెక్కు చెదరని చిరునవ్వు! తరలివచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూనే కేసీఆర్ చెప్పకనే చెప్పిన మాట.. మౌనంగానే పంపిన ఓ హెచ్చరిక..‘కుట్రదార్లూ… ఖబడ్దార్’!!
ఉద్యమనేత మాత్రమే కాదు జనహృదయాధినేత కేసీఆర్. రాష్ట్ర సాధకుడు.. ప్రగతి సాధకుడు కేసీఆర్. ఆయనపై కక్షగట్టి, ప్రతీకారేచ్ఛతో కేసులు పెడుతుండటాన్ని ఆశామాషీగా తీసుకోవడం లేదు తెలంగాణ. అందుకే పస లేని కేసులో సిట్ నోటీసులు అంటేనే ఊరూవాడ భగ్గునమండింది. బీఆర్ఎస్ శ్రేణులే కాదు జనం ఎక్కడికక్కడ నిరసనలకు దిగారు. ర్యాలీలు చేపట్టారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రేవంత్ సర్కార్‌పై నిప్పులు చెరుగుతూనే ముక్తకంఠంతో నలుదిశలా మార్మోగిన మాట..‘కుట్రదార్లూ… ఖబడ్దార్’!!
ఫోన్‌ట్యాపింగ్ పేరిట అల్లబడిన చిల్లర కేసులో అన్ని అడ్డదారులను తొక్కుతున్నది ప్రభుత్వం. పోలీసులను పావుల్ని చేసి ఆడిస్తున్నది. ఆఖరికి నోటీసులు ఇవ్వడంలోనూ చట్టబద్ధంగా వ్యవహరించలేదు. మొదట కేటీఆర్.. తర్వాత హరీశ్.. ఆ తర్వాత సంతోష్.. ఇప్పుడు కేసీఆర్! కేవలం బీఆర్ఎస్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సాగుతున్న రాజకీయ వికృతక్రీడ.. బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త పోరాటాన్ని పాదుకొల్పుతున్నది. ఎక్కడ లేని ఐక్యతను క్యాడర్లో నింపుతున్నది. తీవ్ర నిర్బంధంలోనే ఉద్యమాలు పురుడు పోసుకుంటాయి. ఇప్పుడు పట్నం నుంచి పల్లె దాక నరనరాన విద్యుత్తేజం నింపుకొన్న గులాబీసేన పిడికిలెత్తి గర్జిస్తున్నది..‘కుట్రదార్లూ… ఖబడ్దార్’!!
ప్రతిసారీ విచారణలో అదే డ్రామా! సిట్ నోటీసులు.. మరునాడు విచారణకు రావాలనడం! పసలేని ప్రశ్నలు.. పదే పదే అడగటం.. అన్నింటికి మించి, లోన ఏదో జరిగిపోతుందన్నట్టు గాంధీభవన్నుంచో, సీఎంవో నుంచో లీకులు వెదజల్లడం.. దాన్ని పట్టుకొని వందిమాగధ మీడియా వంటావార్పునకు దిగడం, కల్పిత కథనాలను వండివార్చడం! రెండేండ్లుగా అదే డ్రామా! అదే స్క్రిప్ట్! తెలంగాణ ఇంటిపార్టీపై కుతంత్రాలతో విసిగి వేసారిన జనం నిగ్గదీస్తున్నది ఒకేమాట.. ‘కుట్రదార్లూ… ఖబడ్దార్’!!