హైదరాబాద్ సిటీబ్యూరో/ శంషాబాద్ రూరల్/హైదరాబాద్/రాజన్న సిరిసిల్ల, మే 1 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్ : బంధువులైన రెండు కుటుంబాలు దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌లోని తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 16కు సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుకనుంచి కారు ఢీకొట్టడంతో ఆరుగురి ప్రాణాలు గాల్లో కలిశాయి. అందరూ సిరిసిల్లకు చెందిన రక్తసంబంధీకులే అవడం, ముగ్గురు చిన్నారులు ఉండటం తీవ్ర విషాదం నింపింది. విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సర్దార్‌నగర్‌కు చెందిన బొల్లి శివకుమార్ (40), బొల్లి లాస్య (35) దంపతులకు కూతురు రిషిక (8) ఉన్నారు. వీరు హైదరాబాద్ సనత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు.
శివకుమార్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, లాస్య సివిల్సప్లై శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో సిరిసిల్లలో ఉంటున్న శివకుమార్ సోదరి కోడం తేజశ్రీ (శ్వేత) (36), భర్త శ్రీనివాస్ (41), పిల్లలు కృష్ణచంద్ర (14), మాధవ్ (11)తో కలిసి గురువారం హైదరాబాద్‌కు వెళ్లారు. శుక్రవారం రెండు కుటుంబాలు యాదగిరిగుట్ట, స్వర్ణగిరిలో దైవదర్శనానికి వెళ్లాయి. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో శంషాబాద్ ఓఆర్ఆర్పై 16వ ఎగ్జిట్ వద్ద ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు అతివేగంగా ఢీకొన్నది. దీంతో కారు లారీలో ఇరుక్కొని నుజ్జునుజ్జయింది. అక్కడికక్కడే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కారులో నుంచి మృతదేహాలను అతికష్టం మీద వెలికితీశారు.
ఈ ప్రమాదంలో శివకుమార్, లాస్య, శ్రీనివాస్, చిన్నారులు రిషిక, కృష్ణచంద్ర, మాధవ్ మృత్యువాతపడ్డారు. కోడం తేజశ్రీ(శ్వేత) చావు బతుకుల్లో ఉండగా హైదరాబాద్ ఉస్మానియా దవాఖానకు తరలించారు. అనంతరం కిమ్స్‌కు తరలించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు బొల్లి రామ్మోహన్ సోదరుడు బొల్లి రాజు కొడుకు, కోడలు, అల్లుడి కుటుంబాలు మృత్యువాతపడటంతో తీవ్ర విషాదం నెలకొన్నది. విషయం తెలుసుకున్న శంషాబాద్ డీసీపీ యోగేశ్‌గౌతం ఘటనాస్థలానికి చేరుకున్నారు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అలసిపోయి రెప్పవాల్చడంతో వేగంగా వెళ్లి కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ఉంటుందని డీసీపీ వెల్లడించారు. దర్యాప్తులో ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని చెప్పారు. సూర్యాపేట నుంచి నూకల లోడ్‌తో నంద్యాలకు వెళ్తుండగా లారీపై ఉన్న తాడిపత్రి సరిగాలేకపోవడంతో, సరిచేసేందుకు పక్కకు ఆపుకొన్నట్టు డ్రైవర్ శ్రీనివాస్ తెలిపారు. తాను డ్రైవింగ్ సీట్లోనే ఉన్నానని, క్లీనర్ లారీపైకి ఎక్కి తాడిపత్రి సరిచేస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు.. లారీని ఢీకొట్టిందని వెల్లడించారు.
శంషాబాద్ ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందడంపై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేత బొల్లి రామ్మోహన్ సోదరుడు రాజు కుటుంబసభ్యులు రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడం తమ హృదయాన్ని కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బాధిత కుటుంబసభ్యులకు సంతాపం ప్రకటించారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదంలో సిరిసిల్లవాసులు ఆరుగురు మృతిచెందడంపై మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఆయన తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. సిరిసిల్ల బీఆర్ఎస్ నాయకుడు బొల్లి రామ్మోహన్ సోదరుడు బొల్లి రాజు కుటుంబసభ్యులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడంపై సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్, వారికి ధైర్యం చెబుతూ అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే కేటీఆర్ తన కార్యాలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఘటనా స్థలానికి వెళ్లి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని పీఏ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. శంషాబాద్ ఏసీపీ నాగభూషణంతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు, ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో ఎకడా జాప్యం జరుగకుండా చూడాలని కోరారు. కేటీఆర్ ఆదేశాల మేరకు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా గాయపడిన మహిళకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. తీవ్ర గాయాలతో ఉన్న శ్వేతను కిమ్స్ దవాఖానకు తరలించారు. నియోజకవర్గ ప్రజల ప్రాణాలు ఇలా రోడ్డు ప్రమాదాల్లో పోవడం తనను ఎంతగానో కలచివేసిందని, బాధిత కుటుంబాలకు పార్టీపరంగా, వ్యక్తిగతంగా పూర్తిస్థాయిలో తోడుంటామని స్పష్టంచేశారు.