కాంగ్రెస్ మోసం!.. అమరుల త్యాగం!.. కేసీఆర్ దీక్ష!.. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలను పరిశీలిస్తే వెల్లడయ్యే నిజమిదే. 60 ఏండ్లుగా అడుగడుగునా కాంగ్రెస్ ఎలా వంచించిందో తెలంగాణలో చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు. సుదీర్ఘ స్వరాష్ట్ర పోరాటం.. కేసీఆర్ లిఖించిన ఉద్యమ వ్యూహం ఫలితమే తెలంగాణ రాష్ట్రం. ఢిల్లీ దయాభిక్షతో రాష్ట్రం ఇచ్చిందని ఎవరైనా అంటే.. అది అలుపెరగని ఈ నేల పోరాటాన్ని అవమానించడమే. ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరుల త్యాగాలను పలుచన చేయడమే. ఊరూవాడా కదిలించిన ఉద్యమస్ఫూర్తిని దారుణంగా దెబ్బతీయడమే. సబ్బండ వర్ణాల సామూహిక రణగీతికను చులకనచేయడమే. ఢిల్లీ దిగిరాలేదు. ఉద్యమం కిందికి దింపింది. వంచక కాంగ్రెస్ మెడలు వంచిన శక్తి మాత్రం ముమ్మాటికీ కేసీఆర్.
Telangana | హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఆరు దశాబ్దాల కాంగ్రెస్ మోసం… వందలాది మంది అమరవీరుల త్యాగం… కేసీఆర్ దీక్షాఫలం… ఇదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక ఉన్న నేపథ్యం. సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగానే స్వరాష్ట్ర కల సాకారమైంది. కానీ, తెలంగాణ భౌగోళిక, సాంస్కృతిక పోరాట ఆనవాళ్లు లేని నోళ్లు.. నేడు కేసీఆర్ ఆనవాళ్లే లేకుండా చెరిపేస్తామని ప్రతినబూనుతున్న సందర్భంలో నాటి పరిణామాలను నెమరువేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇది నిజం. డిసెంబర్ 9 ముమ్మాటికీ తెలంగాణ విజయ్ దివస్. ఆ విజయం వెనుక 2009 నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడేదాకా 11 రోజులపాటు యావత్ ప్రపంచం తెలంగాణ వైపు ఉత్కంఠగా ఎదురుచూసింది. ఒకవైపు క్షీణిస్తున్న కేసీఆర్ ఆరో గ్యం.. మరోవైపు, ‘నా చావుతోనైనా తెలంగాణ రావాలి’ అనే తెగింపుతో తెలంగాణ కోసం ఆత్మత్యాగాలకు సిద్ధపడ యువతరం.
ఇంకోవైపు, పదవులను అంటిపెట్టుకొని పెదవులు మూసుకున్న కాంగ్రెస్ నాయకగణం! ఊరూరా ఉప్పెనలా… ఉమ్మడిగా సాగిన తెలంగాణ ఉద్యమం.. ఇవన్నీ ఇంకా కండ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. స్వరాష్ట్రం కోసమే పుట్టిన పార్టీతో 2004లో పొత్తుపెట్టుకొని యూపీయే కామన్ మినిమమ్ ప్రోగ్రాం (కనీస ఉమ్మడి ప్రణాళిక)లో వాగ్దానం చేసి, రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ ఇస్తామని ప్రమాణం చేసి, ఆ టర్మ్ మొత్తం ఇవ్వకుండా దాటవేసిన కాంగ్రెస్.. ఆ తరువాత 2009 ఎన్నికల్లో తెలంగాణపై ఒట్టేసి… డిసెంబర్ 9న రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించి.. అదే నెల 23న యూ టర్న్ తీసుకోవడం చారిత్రక వాస్తవం. యూటర్న్ నాటి నుంచి 2014 దాకా రాష్ట్రంలో జరిగిన ఆత్మబలిదానాలకు బాధ్యులెవరు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే ఆత్మబలిదానాలు జరిగింది నిజం కాదా? ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించినప్పటి నుంచి డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడేదాక జరిగిన పరిణామాల సమహార ప్రత్యేక కథనం. ఈ 11 రోజుల ఏ రోజు ఏం జరిగిందో క్లుప్తంగా…
నవంబర్ 29: మొదక్ జిల్లా సిద్దిపేట మండలం రంగధాంపల్లి చౌరస్తాలోని ఆమరణ నిరాహార దీక్షా వేదికను చేరుకునేందుకు కేసీఆర్ కరీంనగర్ నుంచి బయలుదేరారు. మానేరు డ్యామ్ దాటిన తరువాత అల్గనూరులో పోలీసులు కేసీఆర్ వాహనాన్ని నిలిపివేశారు. బలవంతంగా వేరే వాహనంలోకి మార్చి వరంగల్ మీదుగా ఖమ్మం తరలించారు. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులను పార్టీలు, ప్రజాసంఘాలు ఖండించాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఊపందుకున్నాయి. కేసీఆర్ అరెస్టును నిరసిస్తూ టీఆర్ఎస్వీ నాయకుడు శ్రీకాంతాచారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నారాయణఖేడ్ మండలం పలుగుతండాలో ఏడుగురు చిన్నారులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి దిగారు. కేసీఆర్‌ను ఖమ్మం సబ్ జైలుకు తరలించారు. ఆహారం తీసుకోకుండా, మందులు వేసుకోకుండా జైలులోనే దీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు.
నవంబర్ 30: టీఆర్ఎస్, న్యూడెమోక్రసీ పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించాయి. విద్యార్థి, ఉద్యోగ, ప్రజాసంఘాలు ఈ బంద్‌కు మద్దతిచ్చాయి. న్యాయవాదులు కోర్టు విధులను బహిషరించారు. 1969 ఉద్యమం తర్వాత తొలిసారిగా తెలంగాణ సంపూర్ణంగా బంద్ పాటించింది. విశ్వవిద్యాలయాల్లో ఆందోళనలు తీవ్రమయ్యాయి. కేసీఆర్ అరెస్టుకు కలతచెంది టీఆర్ఎస్పీ నేత భూక్యా ప్రవీణ్, దుద్దెడకు చెందిన శ్రీకాంత్, దండిక పృథ్వీరాజ్ ఆత్మహత్య చేసుకున్నారు. బొల్లి లక్ష్మీనారాయణ గుండెపోటుతో మరణించారు.
డిసెంబర్ 1: ఖమ్మం ప్రభుత్వ దవాఖాన వద్ద ఉన్న కేటీఆర్, హరీశ్‌రావును పోలీసులు బలవంతంగా ఈడ్చుకుపోయారు. బలవంతంగా స్లైన్ ఎకించేందుకు వైద్యులు ప్రయత్నిస్తే కేసీఆర్ వాళ్లను బయటకుతోసి, తలుపులు వేసుకున్నారు. కానిస్టేబుల్ కిష్టయ్య కామారెడ్డిలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
డిసెంబర్ 2: విద్యార్థులు, ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేశారు. పరామర్శించేందుకు వచ్చిన మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డితో మాట్లాడేందుకు కేసీఆర్ నిరాకరించారు.
డిసెంబర్ 3: తెల్లవారుజామున ఖమ్మం నుంచి కేసీఆర్‌ను నిమ్స్‌కు తరలించారు. ‘నిమ్స్ నుంచే తెలంగాణ జైత్రయాత్ర. లేకుంటే… నా శవయాత్రే’ అని కేసీఆర్ పునరుద్ఘాటించారు. కాంగ్రెస్, టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను ప్రజలు తగులబెట్టారు. తెలంగాణ మంత్రులను తిరగనియ్యబోమని ప్రజాసంఘాలు ప్రకటించాయి. విద్యార్థి ఉద్యమాన్ని నిలువరించేందుకు ఉన్నత విద్యాసంస్థలకు 15 రోజులు సెలవు ప్రకటించారు. శ్రీకాంతాచారి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వరంగల్ జిల్లాలో మల్లెనేని రాజ్‌కుమార్ మృతి చెందాడు.
డిసెంబర్ 4: రక్తంలో పొటాషియం, సోడియం తగ్గడంతో కేసీఆర్‌ను అత్యవసర వైద్య విభాగానికి తరలించారు. కోమాలోకి పోయే ప్రమాదం ఉన్నదని వైద్యులు హెచ్చరించారు. ప్రజలు మెచ్చే ప్రకటన చేసే వరకు తన దీక్ష, తెలంగాణ ప్రజల ఆందోళనలు కొనసాగుతాయని కేసీఆర్ ప్రకటించారు. డిసెంబర్ 9లోగా తెలంగాణ రాష్ర్టాన్ని ప్రకటించకుంటే 10వ తేదీన అసెంబ్లీని ముట్టడిస్తామని విద్యార్థి జేఏసీ ప్రకటించింది. తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇండ్లను ప్రజలు ముట్టడించారు. దిష్టిబొమ్మలను తగులపెట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 57 సంఘాలు హైదరాబాద్‌లో సమావేశం అయ్యాయి.
డిసెంబర్ 5: తన చేతిలో ఏమీ లేదని నాటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ప్రకటించారు. మీరే గట్టెకించాలంటూ వీరప్పమొయిలీని పీసీసీ అధ్యక్షుడు కోరారు. సీఎం, పీసీసీ అధ్యక్షుడే పరిషరించుకోవాలని కాంగ్రెస్ నేత లు ప్రకటించారు. తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చాలనే ప్రజల ఒత్తిడితో కాంగ్రెస్ నేతలు సోనియాకు లేఖ రాశారు. తెలంగాణ 48 గంటల బంద్ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా వాహనాలు ఎకడికకడే నిలిచిపోయాయి. రెండు రోజులపాటు పెన్‌డౌన్ చేయాలని ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బలగాలను పంపాలని కోరింది. హైదరాబాద్‌లో 144 సెక్షన్ అమలు చేశారు.
డిసెంబర్ 6: 48 గంటల బంద్‌లో భాగంగా తొలి 24 గంటలు విజయవంతమైంది. కేసీఆర్ అవయవాలు క్షీణిస్తున్నాయని, ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉన్నదని నిమ్స్ డైరెక్టర్ ప్రకటించారు. దీక్ష విరమిస్తే ప్రాణాలు దకుతాయని వైద్యులు సూచించినా కేసీఆర్ తగ్గలేదు. మంత్రులు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పరామర్శించారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెడితేనే విరమిస్తానని కేసీఆర్ సీఎంకు తేల్చి చెప్పారు. రాష్ట్ర రాజధాని ఫ్రీజోన్ కాదని అసెంబ్లీలో తీర్మానం పెడతామని, కేసీర్‌పై కేసులు ఎత్తివేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
డిసెంబర్ 7: 48 గంటల తెలంగాణ బంద్ విజయవంతమైంది. మరో ఐదుగురు తెలంగాణ కోసం బలవన్మరణానికి పాల్పడ్డారు. మరోవైపు, జర్నలిస్టులపై పోలీసులు దాడి చేసి, కెమెరాలను ధ్వంసం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు అండగా ఉన్న వడ్డెరబస్తీపై పోలీసులు దాడి చేశారు. న్యాయవాదులు కోర్టు విధులను బహిషరించారు.
డిసెంబర్ 8: కేసీఆర్ ఆరోగ్యం ప్రమాదకరంగా ఉన్నదని, ప్రొటీన్లు, అల్బుమిన్లు లోపించాయని, ఇక తమ చేతుల్లో ఏమీలేదని వైద్యులు తెలిపారు. తెలంగాణ ఉద్యమం కోసం మరో ముగ్గురు ఆత్మబలిదానం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించేందుకు సీఎం ఢిల్లీ చేరుకున్నారు. కేంద్రం 23 వేల మందితో కూడిన సాయుధ బలగాలను తెలంగాణ జిల్లాల్లో దింపింది. ప్రత్యేక ఆంధ్ర కావాలని ఆంధ్రా ప్రాంతంలో జై ఆంధ్ర ఉద్యమం ఆరంభించారు.
డిసెంబర్ 9: రోజంతా ఇటు హైదరాబాద్… ఇటు ఢిల్లీలో నాటకీయ పరిణామాలు జరిగాయి. తెలంగాణ నినాదాలతో పార్లమెంట్ హోరెత్తింది. కేంద్ర మంత్రివర్గ సమావేశమైంది. సమావేశం నుంచి చిదంబరం బయటికి వచ్చి ఫోన్లో కేసీఆర్, జయశంకర్‌సార్‌తో సంభాషించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనపై సమాలోచనలు జరిగాయి. రాష్ట్ర ఏర్పాటు ప్రకటన విషయంలో స్పష్టమైన పదజాలం ఉండాల్సిందేనని చిదంబరానికి స్పష్టంచేశారు. అనేక పరిణామాల అనంతరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని, విద్యార్థులు, ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తామని అప్పటి కేంద్ర హోం శాఖ మంత్రి చిదంబరం ఆ రోజు రాత్రి ప్రకటించారు. ప్రకటన అనంతరం నిమ్స్ నుంచి ‘ఇది తెలంగాణ ప్రజల విజయం’ అని కేసీఆర్ ప్రకటించారు. జయశంకర్‌సార్, ఆర్ విద్యాసాగర్‌రావు, మంద కృష్ణమాదిగ తదితరులు నిమ్మరసం తాగించి కేసీఆర్ దీక్ష విరమింపజేశారు. తెలంగాణ ప్రజల సంబురాలు అంబరాన్నంటా యి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రాష్ట్ర విద్యార్థులు అసెంబ్లీకి తెలంగాణ జైత్రయాత్ర చేపట్టారు.
నవంబర్ 29: ఆమరణ దీక్షకు బయల్దేరిన కేసీఆర్‌ను అడ్డుకొని ఖమ్మం తరలించిన పోలీసులు. జైల్లోనే దీక్షకు సిద్ధం. శ్రీకాంతాచారి ఆత్మహత్యాయత్నం