కోదాడ/వరంగల్: సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ సమీపంలోని దుర్గాపురం స్టేజీ వద్ద ఆగిఉన్న లారీని ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద దాటికి కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వానికి తరలించారు. హైదరాబాద్ నుచి విజయవాడకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నదని చెప్పారు. అతివేగం, నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్థారించారు.
మరో ఘటనలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొని నలుగురు విద్యార్థులు మృతిచెందారు. గురువారం రాత్రి వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై వర్ధన్నపేట నుంచి వరంగల్ వైపు వెళ్తున్న బైకును ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతిచెందారు. ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరొకరు దవాఖానకు తరలిస్తుండగా చనిపోయారని పోలీసులు తెలిపారు. మృతులను వరుణ్ తేజ, సిద్దు, గణేశ్, రనిల్కుమార్గా గుర్తించారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాదానికి కారణమైన వాహనాలను తొలగించిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.